నిజమే… ఏపీలోని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సర్కారు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే… లెక్కలేనన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల ప్రజల మాటెలా ఉన్నా… వైసీపీ సర్కారు ఊదరగొడుతున్నట్లుగా త్వరలోనే పరిపాలనా రాజధానిగా అవతరించనున్న విశాఖ నగర ప్రజలు అయితే… తమ నగరం అభివృద్ధి కంటే కూడా జగన్‌కు భూముల అమ్మకాలే ప్రధానమైపోయిందని భావిస్తున్నారు. అంతేకాదండోయ్… పరిపాలనా రాజధానిగా మారేలోగానే విశాఖలోని సర్కారు భూములన్నింటినీ జగన్ తెగనమ్మేయడం ఖాయమేనన్న భయాందోళనలు కూడా విశాఖ వాసుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇందుకు విపక్షాలు చేస్తున్న విమర్శలు ఎంతమాత్రం కారణంగా కనిపించడం లేదు. జగన్ సర్కారు వరుసపెట్టి తీసుకుంటున్న నిర్ణయాలే హేతువులుగా నిలుస్తున్నాయని చెప్పాలి. అదెలాగో చూద్దాం పదండి.
పెద్దగా స్పందించని విశాఖ వాసులు
మొన్నటి సార్వత్రిక ఎన్నికల దాకా టీడీపీ హయాంలో రాజధానిగా ప్రకటించిన అమరావతిలోనే తాను కూడా రాజధానిని కొనసాగిస్తానని నమ్మబలికిన జగన్… ఎన్నికలు ముగిసి తాను అధికారంలోకి రాగానే మాట మార్చేశారు. అమరావతిలో చంద్రబాబు సామాజిక వర్గం మాత్రమే లబ్ధి పొందిందని ఎప్పటికప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తూ సాగుతున్న జగన్… అమరావతిని కేవలం శాసన రాజధానికి మాత్రమే పరిమితం చేసి విశాఖను పరిపాలనా రాజధానిగా,కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనపై విశాఖ వాసులు పెద్దగా స్పందించలేదు కూడా. ఎందుకంటే… విశాఖ ఇప్పటికే బాగానే అభివృద్ధి చెందిన నగరమే. రాజధాని రావడం వల్ల తమకు పెద్దగా ఒరిగేదేమీ లేదని, పైపెచ్చు రాజధాని రాకతో నగరంలో ఓ విశృంఖలమైన కల్చర్ రాబోతుందని, ట్రాఫిక్ ఇక్కట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతాయని కూడా విశాఖ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తమ మనసులోని భావనలను వారు ఎంతమాత్రం బయటపెట్టకుండానే… అసలు ఏం జరుగుతుందో చూద్దామన్న భావనలో పడిపోయారు.

వాలిపోయిన జగన్ వర్గం
ఎప్పుడైతే విశాఖను అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్‌గా ప్రకటించారో… అప్పటి నుంచే జగన్ వర్గం విశాఖ నగరంపై వాలిపోయిందన్న వాదనలు పెద్ద ఎత్తున వినిపించాయి. నగరంలో తమకు అనుకూలంగా ఉన్న విషయాలేమిటన్న వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన జగన్ వర్గం… మొదట అక్కడి సర్కారీ భూములతో పాటుగా అత్యంత విలువైన ప్రైవేట్ భూములు, ఆయా భూముల్లోని వ్యాపారాలపై కన్నేసింది. సామ దాన బేధ దండోపాయాలతో ప్రైవేట్ వ్యక్తులను లొంగదీసుకున్న జగన్ వర్గం… ఆ తర్వాత ప్రభుత్వ భూములపై కన్నేసింది. ఇందులో భాగంగా గతంలో టీడీపీ హయాంలో లులూ గ్రూపునకు లీజుకిచ్చి అభివృద్ధి చేయాలనుకున్న 14 ఎకరాలపై వైసీపీ నేతలు కన్నేశారు. ఆ భూములను అభివృద్ధి చేయడమన్న విషయాన్ని పక్కన పెట్టేసిన వైసీపీ సర్కారు… వాటిని తెగనమ్మేందుకు పథకం రచించింది. దాదాపు రూ.15 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూములను ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అమ్మాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్నది విశాఖ వాసుల అభిప్రాయం. ఆ భూములను ఏదో ఒక సంస్థకు లీజుకివ్వడమో, లేదంటే ప్రభుత్వమే ఓ ప్రాజెక్టు కట్టడమో చేస్తే అన్ని విధాలా బాగుంటుందన్నది వారి భావనగా తెలుస్తోంది.
ఎవరేమనుకున్నా..
అయితే ఇవేవీ పట్టని వైసీపీ సర్కారు…. ఆ భూములను తెగనమ్మేందుకే సిద్ధపడిపోయింది. ఇప్పటికే సదరు భూముల అమ్మకానికి నోటీసులు జారీ చేయగా… త్వరలోనే విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. మొత్తంగా ఎవరేమనుకున్నా… తాను అనుకున్నట్లుగా విశాఖలో సింగిల్ సెంటు భూమి కూడా ప్రభుత్వానికి ఉండరాదన్న భావనతోనే జగన్ ముందుకు సాగుతున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసిన మోదీ సర్కారుకు లేఖ రాసిన జగన్… ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేని పక్షంగా విశాఖ ఉక్కుకు అనుబంధంగా ఉన్న వేల ఎరకాల భూముల్లో కొంత మేర ఎకరాలను అమ్మాలని, తద్వారా వచ్చిన నిధులతో విశాఖ ఉక్కు నష్టాలను తీర్చాలని ఓ వింత ప్రతిపాదన చేశారు. అంటే… ఇక్కడ కూడా విశాఖలోని విలువైన భూములను ఎలా అమ్మాలన్న దిశగానే ఆలోచిస్తున్న జగన్… అసలు సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా జగన్ ఇలా వరుసగా నగరంలోని భూముల విక్రయంపై పదే పదే ప్రకటనలు చేస్తున్న వైనాన్ని గమనిస్తున్న విశాఖ వాసులు… తమ నగరాన్ని రాజధానిగా అభివృద్ధి చేయడాని కంటే ముందుగానే నగరంలోని విలువైన భూములను హస్తగతం చేసుకోవడం, సర్కారీ భూములను తెగనమ్మడం మీదే జగన్ దృష్టి సారిస్తున్నారన్న భావనకు వచ్చేశారు.
Must Read ;- పరిపాలనా రాజధానా.. విశాఖను అమ్మేసేందుకు వైసీపీ ప్లానా?











