జులైలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామంటూ వైసీపీ ప్రభుత్వం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసిక హింసకు గురి చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఏపీ సీఎం జన్మోహన్ రెడ్డి విద్యార్ధుల పాలిట మెంటల్ మామలా తయారయ్యారని ఆయన విమర్శించారు. ఇప్పటికే 4 వేల మంది పిల్లలు కరోనా బారిన పడ్డారని, 550 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కోవిడ్ బారినపడి చనిపోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తూ ఉంటే ఏపీలో మాత్రం జూలైలో పరీక్షలు నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రోజుకోమాట..
విద్యామంత్రి సురేష్ రోజుకొక మాట చెబుతూ విద్యార్థులను తికమక పెడుతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. జులైలో పరీక్షలు నిర్వహిస్తామని ఒకసారి, సమయం సరిపోకపోతే పరీక్షలు వాయిదా వేస్తామని మరోసారి చెబుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. మీ నిర్ణయం వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఎకడమిక్ ఇయర్ కోల్పోతున్నారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించాలంటే అక్టోబరు అవుతుందని, ఇప్పటికే మరో విద్యా సంవత్సరం ప్రారంభమైందని ఆయన గుర్తు చేశారు. అంటే నాలుగు నెలల్లోనే ఈ విద్యా సంవత్సరాన్ని ముగిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. పరీక్షలు నిర్వహిస్తే 5 లక్షల మంది విద్యార్ధులు కోవిడ్ బారిన పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రద్దు చేయాలని కోరుతున్నారని లోకేష్ గుర్తు చేశారు.
Must Read ;- లోకేష్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని.. పరీక్షలు రద్దు చేయని జగన్











