సూపర్ స్టార్ మహేశ్ బాబు, అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వురు’ మూవీ .. లాస్టియర్ సంక్రాంతికి విడుదలై దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఆ ఊపుతోనే ఇప్పుడు మహేశ్ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా లేట్ గా తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేశ్ ఏ దర్శకుడితో పనిచేయబోతున్నాడనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.
నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి సినిమా చేయబోయేది మహేశ్ తోనే. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ఈ అక్టోబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది. దానికి ఇంకా చాలా టైమ్ పడుతుంది. అలాగే.. మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ వచ్చే ఏడాదికి కానీ విడుదల కాదు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి ఖాళీ అయినప్పటికీ.. మహేశ్ బాబు అందుబాటులో ఉండడం కష్టం. ఒక వేళ మహేశ్ తో సినిమా మొదలు పెట్టాలనుకున్నా.. దాని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే చాలా టైమ్ పడుతుంది.
అందుకే ఈ గ్యాప్ లో ప్రిన్స్ .. ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి లిస్ట్ లో ఉన్నారు. ఈ ఇద్దరు దర్శకులు మహేశ్ కి హిట్స్ ఇచ్చారు. అయితే వీరిలో అనిల్ రావిపూడితో సినిమా చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఆల్రెడీ అనిల్ .. మహేశ్ కి కథ చెప్పడం.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం కూడా జరిగిపోయాయని సమాచారం. సర్కార్ వారి పాట చిత్రీకరణ పూర్తయిన వెంటనే.. అనిల్ రావిపూడి సినిమా సెట్స్ మీదకు వెళుతుందని టాక్. ప్రస్తుతం అనిల్ చేస్తున్న ఎఫ్ 3 మూవీ ఆగష్ట్ 27న విడుదల కాబోతోంది. ఆ తర్వాత ఏ నవంబర్ కో, డిసెంబర్ కో సర్కారు వారి పాట చిత్రీకరణ కూడా కంప్లీట్ అవుతుంది. అందుకే ఈ కాంబో మూవీకే ఎక్కువ అవకాశాలున్నాయని ఫిల్మ్ వార్గాల వారి మాట. మరి అనిల్ ఈసారి మహేశ్ కోసం ఎలాంటి కథ రాసుకుంటాడో చూడాలి.