వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతుందనే వార్త రాసిన ఆంధ్రజ్యోతి..రెండు తెలుగురాష్ట్రాల్లో రాజకీయవర్గాలకు షాక్ ఇచ్చింది. ఆ కథనం తప్పని..ఒప్పని..సగం తప్పని..సగం ఒప్పని..ఇలా ఎవరికి వారు తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. తరువాతి కాలంలో షర్మిల పార్టీ పెట్టడం ఖారారైంది. ఆ ఒక్క వార్తాకథనం ఆంధ్రజ్యోతి గ్రాఫ్ పెరిగేందుకు బాగానే ఉపయోగపడిందని చెప్పవచ్చు. తాము ఎవరికీ భయపడం..ఏదీ దాయం.. మాది దమ్మున్న ఛానెల్, అవసరమైతే దెయ్యంతోనైనా పోరాడతాం (జనగాం ఆపరేషన్ ) అని చెప్పే మీడియా గ్రూపు.
రాధాకృష్ణ తనదైన శైలిలో గీతోపదేశం
మరి అలాంటి గ్రూపుని ఏపీలో బహిష్కరిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటన విడుదల చేశారు. మరి ఆంధ్రజ్యోతి ఊరుకుంటుందా..రాధాకృష్ణ మరోసారి తనదైన శైలిలో గీతోపదేశం చేశారు. కొత్త పలుకులో ఏపీ బీజేపీ పరువు తీసేశారు. ఒక్క మాటలో, గౌరవప్రదమైన భాషలో చెప్పాలంటే ఏం చేసుకుంటారో చేస్కోండి..మీరు చేసేదేం లేదు.. నేను జగన్ లాగా లేదా చంద్రబాబులా రాజకీయ నాయకుడిని కాదు.. మీకు, మీ అదినాయకత్వాన్ని చూసి చూసి భయపడడానికి..ముందు మీ సంగతి, పరిస్థితి ఏంటో తెలుసుకోండి అని తేల్చేశారు.
పూల చొక్కా టాపిక్‌తో స్టార్ట్..
పోనీ అలా సూటిగా చెప్పినా బాగుండేది. కాని పూలచొక్కా టాపిక్ తో స్టార్ట్ చేశారు. ఆ సెటైర్ ప్రకారం చూస్తే.. ఓ సినిమాలో హాస్యనటుటు సునీల్ , ధర్మవరపు సుబ్రహ్మణ్యం ల సీన్ తో స్టార్ట్ చేశారు. ఇటీవల అమరావతిపై చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత విష్ణువర్దన్ పై అమరావతి జేఏసీ నేత కె.శ్రీనివాసరావు చెప్పు విసిరిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాసరావుపై ఏబీఎన్ కేసు పెట్టలేదని, క్షమాపణ చెప్పలేదన్న అంశాలను తెరపైకి తెస్తూ ఏబీఎన్ వైఖరికి నిరసనగా తాము ఏబీఎన్ ను బహిష్కరిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటన జారీచేయడంతో ఏపీ బీజేపీ వర్సెస్ ఏబీఎన్ –ఆంధ్రజ్యోతి అన్న వివాదంగా మారింది. దీంతో ఆర్కే కొత్త పలుకుతో ఏపీ బీజేపీపై విరుచుకుపడ్డారు. అందులో కొన్ని అంశాలు చూస్తే..
- బీజేపీపై తప్పుడు ప్రచారం చేయడానికి బీజేపీలోని తమకు నచ్చినవారిని పిలిపించుకుని అదే బీజేపీ స్టాండ్ అని చెబితే పార్టీ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని వీర్రాజు ప్రకటనలో పేర్కొన్నారు. కౌంటర్ గా ఆర్కే.. మీరు వద్దనుకున్నాక.. అంత ఖర్మ మాకు పట్టలేదు. మీ నిర్ణయాన్ని పార్టీలోని వారే గౌరవిస్తారో లేదోనన్న అనుమానంతో ఇలాంటి ప్రకటన చేశారు అని విమర్శించారు.
- కేంద్రంలోని మీ ప్రభుత్వాన్ని చూసుకుని రాష్ట్రంలో అందరినీ బెదిరించి కొందరు ఏపీ బీజేపీ నాయకులు అలవాటు పడ్డారు. అందులో సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, జి.వి.ఎల్ నరసింహారావు తదితరులు ఉండగా వీరికి అండగా ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ ఉన్నారని ఆర్కే సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం మీడియాతో మాత్రమే పార్టీ కార్యకలాపాలు వీరు నడుపుతుంటారని, వీరు కాకుండా ఒకరిద్దరు ఉన్నారని పార్టీలో చర్చకూడా నడుస్తోంది.
- ఈ నలుగురూ బీజేపీ ముసుగులో ఏపీ సీఎం జగన్ ప్రయోజనాలు కాపాడటానికి పనిచేస్తుంటారని స్థానిక బీజేపీ నాయకులు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు కదా అని వ్యాఖ్యానించారు. తనకు భయపడాల్సిన అవసరం లేదు. వీర్రాజు అండ్ కో బీజేపీలోని ఆ నలుగురు ఈ విషయం తెలుసుకుంటే మంచిది అని డైరెక్ట్ అటాక్ చేశారు ఆర్కే.
- ఆ ఘటన గర్హనీయమే అని చెబుతూ..ఆర్కే అందుకు కారణం ఏంటో తెలుసుకోవాలని కూడా వ్యాఖ్యానించారు. తన కొలీగ్ వెంకటకృష్ణ వైఫల్యం కానీ, చానల్ లోపం కానీ ఉండి ఉంటే కచ్చితంగా క్షమాపణ చెప్పేవాళ్లంమని అన్నారు.
- తనకు, వీర్రాజుకు మధ్య ఎలాంటి వివాదాలూ లేవని, తాము ఎప్పుడూ కలుసుకోలేదని, అసలు తమ తప్పులేకున్నా వేరే ద్వేశంతో సోము వీర్రాజు రగిలిపోతున్నారని, అందులో తమకు ఆశ్చర్యం ఏమీ లేదని ఆర్కే వ్యాఖ్యానించారు. బహూశా ఆయన ద్వేషానికి తన సామాజికవర్గం కారణమై ఉండొచ్చన్నారు.
- అంతేకాదు.. నెటిజన్ల కామెంట్లను కూడా చూసుకోవాలని ఆర్కే వ్యాఖ్యానించారు. పార్టీలతో సంబంధం లేనివారుకూడా ఈ ఘటనను విమర్శించిన వారు ఉన్నారని, సమర్థించిన వారూ ఉన్నారని, ఆ దురదృష్టకరమైన సంఘటన విషయంలో శ్రీనివాసరావును సమర్ధించనందుకు టీడీపీ యూత్ వింగ్ ‘పసుపు సైన్యం’ పేరుతో తమ ఛానెల్ బహిష్కరించాలని పిలుపనిచ్చిన ఘటననూ గుర్తు చేశారు ఆర్కే. ఎవరికి వారు నోటి దురద తీర్చుకున్నారని, దీంతో మేము ఎటువంటి తప్పూ చేయలేదని స్పష్టమైంది అని వ్యాఖ్యానించారు.
- తనకు వ్యతిరేకంగా టీడీపీ కుట్రపన్నుతోందనివిష్ణువర్ధన్ రెడ్డి పరోక్షంగా విమర్శించారని, అయితే తమను తాము అతిగా ఊహించుకోవడం అంటే ఇదేనన్నారు ఆర్కే.
- బీజేపీకి ఏపీలో ఏపాటి విలువ ఉందో తెలుసుకుంటే ఆ పార్టీకే మంచిదని, కనీసం ఇటీవల కూడా ఆ పార్టీ ఒక శాతం ఓట్లుకూడా రాబట్టుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు.
- కేంద్రంలో ప్రభుత్వం ఉంది కదా అని రాష్ట్రంలో విర్రవీగితే ఏమీ జరగదని, వీర్రాజు అండ్ కో పార్టీని అధికార వైసీపీకి అనుబంధ సంస్థగా మార్చేశారని బీజేపీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారని గుర్తు చేశారు.
- ఇకపై అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులని నిందిస్తే ప్రజలే బాహాటంగా తిరగబడతారని హెచ్చరికలు చేశారంటే మీపై మీ పార్టీ నాయకల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలని హితవు పలికారు.
- 2014లో విశాఖ ఎంపీగా బీజేపీనుంచి హరిబాబు గెలిచారు. ఇప్పుడు జనసేనతో పొత్తు ఉన్నా..పట్టుమని పది పంచాయతీ స్థానాలు గెలిపించుకోలేకపోయారు. మిమ్మల్ని చూసి పవన్ కల్యాణ్ బీజేపీకి దూరం అవుతున్నది వాస్తవం కాదా అని వ్యాఖ్యానించారు
- మనోభావాలను గౌరవించని ఏ పార్టీకి మనుగడ ఉండదని, అది వీలైనంతవరకు తెలుసుకోవాలన్నారు. ఆ నలుగురి బీజేపీ మరింత అధ్వాన్నంగా తయారవుతోందని పలువురు బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు అని విమర్శించారు
అంతేకాదు..పనిలో పనిగా కేంద్రాన్ని కూడా తూర్పారా బట్టారు ఆర్కే. ప్రైవేటీకరణ ద్వారా మోదీ రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారని, దీనిద్వార తొలుత నష్టపోయేది దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలేనని వ్యాఖ్యానించారు. పెట్రోల్, గ్యాస్ ధరలు, పెట్రోలియం ఉత్పత్తులపై 260శాతం వరకు పన్నులు విధించడాన్ని కూడా లేవనెత్తారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు తనను చూసి రవీంద్రనాథ్ ఠాగూర్‌ను బెంగాలీలు గుర్తుకుతెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ జుట్టు, గడ్డం పెంచుకున్నారని నెటిజన్లు పెడుతున్న కామెంట్లను తీసిపారేయలేమన్న సంచలన వ్యాఖ్య చేశారు ఆర్కే. దీంతోపాటు దిశ రవి అరెస్టునూ ప్రస్తావించారు.