కొంతమంది దానం చేస్తే రెండో కంటికి కూడా తెలియదు. మరికొందరు చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువగా ఉంటుంది. ప్రిన్స్ మహేష్ బాబు ఇలాంటి దానాలు చెయ్యాల్సి వస్తే మాత్రం బయటికి చెప్పరు. మనిషి ఎలా సైలెంటో చేసే పనులు కూడా అలానే ఉంటాయి. ‘శ్రీమంతుడు’ సినిమా తర్వాత కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అలాగే హృద్రోగంతో బాధపడే చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్న విషయం కూడా ఎవరికీ తెలియదు.
ఆంధ్రా హాస్పిటల్స్, లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్స్‌తో కలిసి ఆయన ఈ ఆపరేషన్లు చేయిస్తున్నారు. మూడున్నరేళ్లలో దాదాపు వెయ్యిమందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు కూడా గుండె ఆపరేషన్లు జరిగాయి. ఇది కూడా బయటికి వచ్చేది కాదు గానీ ఆయన భార్య నమ్రత తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా దీన్ని ప్రకటించారు.
‘మరో రెండు చిన్నారుల గుండెలు మా కుటుంబంతో కలిశాయి. ఇటీవల గుండె ఆపరేషన్స్ చేయించుకున్న ఇద్దరు చిన్నారులు ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ విషయం తెలియజేయడానికి మేం ఎంతో సంతోషపడుతున్నాం. ఆంధ్రా హాస్పిటల్స్‌కు అభినందనలు’ అని ఆమె పేర్కొన్నారు. మన హీరోలంతా ఇలాంటి కార్యక్రమాలను విరివిగా చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బాలీవుడ్ లో సోనూ సూద్ ఇలా చేస్తూ జనం గుండెల్లో ఎంతగా చోటు సంపాదించుకున్నాడో అందరికీ తెలుసు.