గంజాయి… ప్రమాదకరమైన మత్తు పదార్థాల్లో ఒకటి. కేవలం యువతనే కాదు… పెద్ద వయస్సు వారి జీవితాలను కూడ ఛిద్రం చేస్తోందీ ఈ మత్తు పదార్ధం. అందులో ముఖ్యంగా ఎంతో భవిష్యత్తు ఉన్న యువత దీనికి బానిస కావడం ఆందోళన కలిగిస్తున్న విషయం. మరి ఇటువంటి ప్రమాదకరమైన పదార్ధం వారికి ఎలా చేరుతోందన్న దానికి సమాధానమే అక్రమ రవాణా. మరి ప్రభుత్వాలు, పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఇది ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్న? కేవలం పోలీసులే కాదు… దీని అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ తమ వేటను కొనసాగిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు, ప్రత్యేక బృందాలు చేయని ప్రయత్నాలంటూ లేవు. కానీ వారి కన్నుగప్పి ఈ ప్రమాదకర గంజాయిని రాష్ట్రాలు దాటిస్తున్నాయి కొన్ని ముఠాలు. అలా గంజాయి వల్ల వేల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి.
ఇటీవల జరిగిన సంఘటనే నిదర్శనం..
ఇటీవల జరిగిన ఒక సంఘటన యువత దీనికి ఎంత ప్రభావితమవుతున్నారో తెలియజేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. దర్గా సెంటర్లో దాదాపు ఎనిమిది కేజీల గంజాయిని, దానిని విక్రయిస్తున్న వారితో సహా పట్టుకున్నారు. విచారణలో కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఆదిత్య కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన కారులో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఇంకా ఎన్నో దిగ్భ్రాంతి కలిగించే నిజాలు బయటపడ్డాయి. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి సూరంపాలెంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు గంజాయి అమ్మకాలు చేపడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేకాదు, ఈ అక్రమ రవాణాకు సంబంధించి గుజరాత్ రాష్టానికి చెందిన కాంతాబాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
దాడులు జరుగుతున్నా ఆగట్లేదు..
ఇదే కాకుండా, కొద్ది రోజుల క్రితం ఏలూరు నుండి తమిళనాడులోని తంజావూరుకు తరలిస్తున్న 70 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కడప, నెల్లూరు… ఇలా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కిలోల సంఖ్యలో గంజాయిని పట్టుకున్నారు. ఇలా పోలీసులు, స్పెషల్ బృందాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ దాడులు నిర్వహిస్తున్నారు. ఎటువంటి రవాణా జరగుతున్నా పసిగట్టి వారిని పట్టుకుంటున్నారు. ఇలా , ఈ గంజాయి రవాణాను నిర్మూలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా నూరు శాతం సఫలీకృతం కావడం లేదు.
యువతపై తీవ్ర ప్రభావం
గంజాయి ఎందరో జీవితాలను నాశనం చేస్తోందనేది అక్షర సత్యం. అందులో ముఖ్యంగా యువత చాలా తేలిగ్గా దీని మత్తుకు బానిసలవుతున్నారు. ప్రభుత్వం గంజాయి రవాణాను అరికట్టడంతో పాటు… యువత దీనివైపు మళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశమంతా కాలేజీలు, విశ్వవిద్యాలయాలు తెరుచుకున్న దాఖలాలు చాలా తక్కువగా ఉన్నందున కాలేజీల్లో విక్రయాలు తగ్గుముఖం పట్టుంటాయని భావించవచ్చు. అలాగని యువతకు ఈ మత్తు పదార్థం అందే మార్గం లేదని ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదు. గంజాయి స్మగ్లింగ్‌పై పటిష్ట నిఘా పెట్టడంతో పాటు… యువత ఎక్కువగా ఉండే స్థలాలపై కన్నేసి ఉంచితే అమ్మకాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, విక్రయించే వారిని కూడా పట్టుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపితే యువత మత్తుకు బానిస కాకుండా కాపాడుకోవచ్చు.











