ఏపీలో మద్యం, ఇసుక అక్రమ రవాణాను నిరోధించడంలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కీలకంగా పనిచేస్తోంది. అయితే సిబ్బంది కొరత ఎస్ఈబీ పనితీరుపై ప్రభావం చూపుతోంది. ఎస్ఈబీని కేవలం మద్యం, ఇసుక అక్రమ రవాణా నిరోధానికే కాకుండా ఆన్ లైన్ జూదాలు అరికట్టడం, డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ నిరోధించేందుకు ఉపయోగించుకోవాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. అయితే , ముందుగా ఎస్ఈబీలను బలోపేతం చేయాలని క్యాబినెట్ గుర్తించింది. తరువాత దీని పరిధిని మరింత విస్తరించి రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి సాగును నిరోధించడంతోపాటు, ఆన్ లైన్ జూదం, పేకాటలను అడ్డుకునేలా చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఎస్ఈబీను బలోపేతం చేసేందుకు వచ్చిన సూచనలపై క్యాబినెట్ చర్చించింది.
ఏపీలో సెబ్ పనితీరు ఎలా ఉంది?
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇసుక, మద్యం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పేరుతో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు. సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ సెబ్ పనిచేస్తుంది. అయితే, ఇప్పటి వరకూ ఈ శాఖకు ప్రత్యేక సిబ్బంది అంటూ ఎవరూ లేరు. అబ్కారీ శాఖలోని 70 శాతం మందిని సెబ్ లోకి బదిలీ చేశారు. వీరంతా నాటు సారా బట్టీలను గుర్తించి వాటిని ధ్వంసం చేయడం, పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా వస్తున్న మద్యాన్ని గుర్తించి సీజ్ చేయడం, అలాంటి వారిపై కేసులు పెట్టడం చేస్తున్నారు. ఇక ఇసుక అక్రమాలను నిరోధించే పని కూడా సెబ్ కు అప్పగించారు. దీంతో ఉన్న సిబ్బందికి తలకు మించిన భారంగా తయారైంది.
సెబ్ కోసం నియామకాలు చేస్తాం .. డీజీపీ
మద్యం, ఇసుక అక్రమాలతో పాటు పేకాట, ఆన్ లైన్ జూదం, గంజాయి, డ్రగ్స్ వంటి అక్రమ వ్యవహారాలను కట్టడిచేసేందుకు సెబ్‌ను బలోపేతం చేయాలని ఇవాళ వెలగపూడి సచివాలయంలో సమావేశమైన ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. సెబ్‌కు ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించనున్నామని డీజీపీ ఇప్పటికే వెల్లడించారు. మద్యం ధరలు తగ్గించడంతో ఏపీలో అక్రమ మద్యం సమస్య చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పవచ్చు. ఇసుక పాలసీని కూడా పారదర్శకంగా అమలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదించింది. ఇదే జరిగితే ఇక సెబ్ గంజాయి, డ్రగ్స్, పేకాట, ఆన్ లైన్ జూదాల వంటి అక్రమ కార్యకలాపాల నిరోధంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది.