నిజమేనండోయ్… కాసులకు కక్కుర్తి పడితే… ఖద్దరు అయినా, ఖాకీ అయినా శిక్షకు సిద్ధమైపోవాల్సిందే. ఏపీలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. గత వైసీపీ పాలనలో ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో స్వైర విహారం చేసిన రాజకీయ నేతలతో పాటు ఉన్నత స్థానాల్లో అధికారులు, శాంతిభద్రతలను పర్యవేక్షణ బాధ్యతల్లో ఉన్న పోలీసులు సైతం వరుసగా బోనులో నిలబడుతున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన చాలా మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు కాగా… సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు అధికారులు వరుసగా బుక్కైపోతున్నారు. ఈ జాబితాలోకి ఇప్పటికే చేరిపోయిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ ఇప్పుడు ఎకంగా విధుల నుంచి ఉద్వాసనకు గురయ్యారు. అంటే,.,ఓ ఐపీఎస్ అధికారిగా ఉన్న ఆయన సస్పెన్షన్ కు గురయ్యారు. సొంత శాఖ చేపట్టిన విచారణలో నిబంధనలకు విరుద్ధంగా నిధులు దిగమింగారన్న ఆరోపణలు నిరూపితం కావడంతో సంజయ్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఈ వ్యవహారంలో మిగిలిన అరెస్ట్ నుంచి ఆయన తప్పించుకుంటారో, లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
దళిత సామాజిక వర్గానికి చెందిన సంజయ్… విద్యార్థిగా ఉన్నతంగా రాణించి దేశంలోనే అత్యున్నత సర్వీసు అయిన సివిల్ సర్వీసెస్ అధికారిగా ఎంపికయ్యారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారిగా విధుల్లోకి చేరిన సంజయ్… తొలినాళ్లలో నేరస్తుల వెన్నులో వణుకు పుట్టించారు. అటు నక్సలైట్లతో పాటుగా ఇటు ఫ్యాక్షన్ ముఠాలకు ముచ్చెమటలు పట్టించిన సంజయ్.,.. తన సర్వీసు రికార్డును మెరుగైన స్థితిలోనే కొనసాగించుకున్నారు. అయితే ఎప్పుడైతే ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిందో… చాలా మంది అధికారుల మాదిరిగానే సంజయ్ కూడా అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తే కార్యానికి జీ హుజూర్ అనేశారు. ఫలితంగా కీలకమైన సీఐడీ విభాగానికి చీఫ్ గా బాద్యతలను చేజిక్కించుకున్న సంజయ్.. నాటి సీఎం జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారు. నేర నిర్ధారణ కాకుండానే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సీఎం నారా చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఈ పరిణామంతో సంజయ్ కు మరింత ప్రాధాన్యం దక్కింది. కోట్లాది రూపాయలను ఆయనకు ఇచ్చిన నాటి సర్కారు… వాటిని మీ ఇష్టమొచ్చినట్లుగా ఖర్చు పెట్టుకోండి అంటూ నజరానాను ప్రకటించింది.
ప్రభుత్వ పెద్దల వత్తాసు… తానేం చేసినా నడిచిపోతుందన్న ధీమాతో సంజయ్ కూడా చేతివాటం ప్రదర్శించారు. సీఐడీ చీఫ్ హోదాలో సమాజంలో అణగారిన వర్గాలకు ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సహా ఇతరత్రా చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన రూ.1.15 కోట్లను ఆయన తన జేబులో వేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు శిక్షణ తరగతులు నిర్వహించకుండానే… ఆ పని చేసినట్లుగా చెప్పి ఆ డబ్బును తనకే చెందిన ఓ సంస్థ ద్వారా నొక్కేశారు. ఆ తర్వాత అగ్నిమాపక శాఖ డీజీ హోదాలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల జారీ కోసం నూతన టెక్నాలజీని అభివృద్ధి పేరిట రూ.60 లక్షలకు పైగా నిధులను సంజయ్ తన జేబులో వేసుకున్నారు. ఈ నిధుల విడుదల కోసం ఆయన అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి హోదాలో ఉన్న సంజయ్ పై వరుసబెట్టి వచ్చిన ఈ ఆరోపణలపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో బాగంగా సంజయ్ నిదుల దుర్వినియోగానికి పాల్పడ్డారని తేలింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం సంజయ్ ను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ వ్యవహారంలో సంజయ్ అరెస్ట్ ను సైతం ఎదుర్కోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.