అమరావతి రాజధాని తీర్పురాక ముందే పరిపాలనా రాజధాని విశాఖకు తరలిపోనుందా? మంత్రి బొత్సగారి మాటలు వింటే అవుననే సమాధానం వస్తోంది. ఏ క్షణంలోనైనా పరిపాలనా రాజధానిని విశాఖకు తరలిస్తామని మంత్రి బొత్స కుండబద్దలు కొట్టారు. మరి రాజధానిపై 63 కేసులు విచారణలో ఉన్నాయి కదా అని అడిగిన ప్రశ్నకు కూడా మంత్రి తడుముకోకుండా సమాధానం చెప్పారు. మూడు రాజధానులపై ఇప్పటికే చట్టం చేశామని, కోర్టును కూడా ఒప్పిస్తామని మంత్రి బొత్స ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కావాలనే రైతులతో హైకోర్టులో కేసులు వేయించి అభివృద్దికి అడ్డుపడుతోందని ఆయన విమర్శించారు. అమరావతి రాజధాని కేవలం 20 గ్రామాలకే పరిమితమని 13 జిల్లాలు అభివృద్ధి కోసమే విశాఖలో పరిపాలనా రాజధాని పెడుతున్నామని ఆయన ప్రకటించారు.
మిగిలిన ఎన్నికలు త్వరలో పూర్తి చేస్తాం
ఏపీలో మిగిలిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి బొత్స వెల్లడించారు. 31 మున్సిపాలిటీల్లో జనాభా లెక్కల ప్రకారం వార్డుల పునర్విభజన చేపట్టి త్వరలో అక్కడ కూడా ఎన్నికలు పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ఇప్పటికే 10 గ్రామాలను విలీనం చేశామని, మరో రెండు గ్రామాలను కూడా కలిపిన తరవాతే అక్కడ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కొత్తగా ఎన్నికైన మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లకు ఈ నెల 31 నుంచి రెండు రోజుల పాటు విజయవాడలో వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు మంత్రి బొత్స వెల్లడించారు.
Must Read ;- రాత్రికి రాత్రి విశాఖకు లేచిపోవాలని జగన్ ప్లాన్.. ఎంపీ రఘురామరాజు