విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపిన విషయం తెలిసిందే. అయితే అది ఇంత వరకు ఆమోదం పొందలేదు. స్పీకర్ ఫార్మాట్లో ఏకవాక్యంతో స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపినా నేటికీ ఆమోదం పొందకపోవడంపై గంటా శ్రీనివాసరావు ఇవాళ స్పీకర్ తమ్మినేనిని స్వయంగా కలిశారు. మొదటి సారి రాజీనామా లేఖ పంపినప్పుడు స్పీకర్ ఫార్మాట్లో లేదని తిరస్కరించారు. రెండో సారి ఎమ్మెల్యే లెటర్ హెడ్‌పై స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ పంపారు. అయినా నేటికీ ఆమోదం లభించకపోవడంపై గంటా శ్రీనివాసరావు, స్పీకర్ తమ్మినేనిని కలసినట్టు ప్రచారం జరుగుతోంది.
రాజీనామా ఆమోదిస్తారా?
గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తారా లేదా అనేది తమ్మినేని విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. ఉప ఎన్నిక కావాలని అధికార పార్టీ భావిస్తే గంటా రాజీనామో ఆమోదించే అవకాశం ఉంది. లేదంటే చంద్రబాబునాయుడు ప్రతిపక్ష హోదా కోల్పోవాలన్నా గంటా రాజీనామా ఆమోదించాల్సి ఉంటుంది. మొదట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తయ్యాక రాజీనామా ఆమోదించాలని గంటా కోరారు. అది ఇప్పట్లో పూర్తి అయ్యే ప్రక్రియ కాదని తేలడంతో, వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని తాజాగా స్పీకర్ తమ్మినేనిని కలసి గంటా శ్రీనివాసరావు విజ్ఙప్తి చేశారు. అయితే స్పీకర్ తమ్మినేని ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
Must Read ;- జీవీఎంసీలో గంటాది వైఫల్యమా.. పార్టీ వీడే ఆలోచనా..?











