గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థలో కచ్చితంగా పసుపు జెండా ఎగురవేస్తామని ధీమాగా ఉన్న టీడీపీ.. అక్కడి ఫలితాలతో షాక్ తింది. హోరాహోరీగా పోరాడినా..క్షేత్ర స్థాయిలో కేడర్ నిర్భయంగా పనిచేసినా.. అధికార పార్టీ ఒత్తిళ్లకు తట్టుకుని నిలబడినా 30 స్థానాలే గెలవడంపై పార్టీలో చర్చ నడుస్తోంది. కాగా పార్టీ కేంద్ర కార్యాలయానికి విశాఖ జిల్లా నుంచి వచ్చిన ఫిర్యాదులు ఇక్కడ ప్రాధాన్య అంశంగా మారాయి.
అంతర్గత రాజకీయాల వల్లే..
ఓవైపు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ,బీజేపీ ఆడుతున్న డ్రామాను, విశాఖలో భూ వివాదాల్లో వైసీపీ నేతల వ్యవహార శైలిని ప్రజల్లోకి తీసుకెళ్లిన టీడీపీ.. అంతర్గత రాజకీయాల వల్ల నష్టపోయిందని ఆ ఫిర్యాదులు ఉండడంపై చర్చ నడుస్తోంది. ఇందుకు గతంలో టీడీపీ టిక్కెట్‌పై గెలిచి వైసీపీకి వెళ్లినవారు ఒక కారణం కాగా.. టీడీపీలోనే ఉండి పార్టీ కోసం పనిచేయకుండా ఉన్నవారే కారణమని స్థానిక నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా విశాఖ (నార్త్) ఎమ్మెల్యే గంటా శ్రీనిసవాసరావు పేరు వినిపిస్తోంది. ఇందుకు విశాఖ నేతలు చెబుతున్న కారణం కూడా చర్చనీయాంశమైంది.
జీవీఎంసీ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, గాజువాక నియోజకవర్గాలు పూర్తిగా ఉండగా, భీమిలి, పెందుర్తి, అనకాపల్లిల్లోని ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు జీవీఎంసీ పరిధిలో ఉన్నాయి. వీటిలో విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. విశాఖ సౌత్ నుంచి టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరారు. మిగిలిన మూడుచోట్ల టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు.
విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నియోజకవర్గ పరిధిలో 15డివిజన్‌లు ఉండగా టీడీపీకి 3 వచ్చాయి. వైసీపీ 9 గెలవగా, జనసేన 1, ఇండిపెండెంట్ లు గెలిచారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు నియోజకవర్గ పరిధిలోని 14 డివిజన్ లు ఉండగా టీడీపీ 5 గెలిచింది. వైసీపీ 9 గెలిచింది. ఇక గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 17 డివిజన్ లు ఉండగా వైసీపీ 15గెలిచింది. టీడీపీ, బీజేపీ ఒక్కొక్క డివిజన్ గెలిచాయి. వాస్తవానికి ఇక్కడ టీడీపీకి ఎక్కువగా వచ్చే డివిజన్‌లే ఉన్నా.. పార్టీని గత 15నెలలుగా గంటా శ్రీనివాసరావు పట్టించుకోకపోవడమే ఇందుకు కారణమన్న అభిప్రాయం నెలకొంది.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో..
ఇక విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ వైసీపీకి వెళ్లినా.. ఇక్కడ టీడీపీ బాధ్యతలను పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్ పర్యవేక్షించారు.ఇక్కడ మొత్తం 13 డివిజన్‌లకు గాను టీడీపీ 4 దక్కించుకోగా వైసీపీ 5 గెలిచింది. ఇక పాక్షికంగా జీవీఎంసీలోకి వచ్చే భీమిలి అసెంబ్లీ పరిధిలో జీవీఎంసీలోని 9డివిజన్‌లు ఉన్నాయి. ఇక్కడ సబ్బం హరి టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఈ 9డివిజన్ లలో టీడీపీ 5గెలిచింది. వైసీపీ నాలుగు గెలిచింది. స్టీల్ ప్లాంట్ ఉండే గాజువాకలో విశాఖ ఉక్క కర్మాగార ప్రైవేటీకరణ చాలా ప్రభావితం చేసింది. ఈ నియోజకవర్గంలోని 17 డివిజన్లలో వైసీపీ 7 మాత్రమే గెలవగా టీడీపీ 7 చోట్ల, టీడీపీ మద్దతుతో సీపీఐ 1, సీపీఎం 1, జనసేన 1 స్థానం దక్కించుకున్నాయి. పెందుర్తిలోనూ అదే పరిస్థితి.మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇక్కడ పర్యవేక్షించారు. జీవీఎంసీ పరిధిలోకి వచ్చే ఆరు డివిజన్లలో టీడీపీ 5 గెలుచుకుంది. వైసీపీ ఒక్క డివిజన్ మాత్రమే గెలిపొందింది. అనకాపల్లి అసెంబ్లీ పరిధిలో జీవీఎంసీలోని 5 డివిజన్ లు ఉండగా వైసీపీ నాలుగు గెలిచింది. టీడీపీ 1 గెలిచింది.
పార్టీకి దూరంగా..
2019 ఎన్నికల ఫలితాల తరువాత గంటా శ్రీనివాసరావు టీడీపీకి దూరంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అంతేకాదు..విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటైజేషన్ ఇష్యూలో రాజీనామా చేసినా.. షరతులు పెట్టడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అంతకు ముందే గంటా వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే వైసీపీలోనే కొందరు నేతలు అడ్డుకోవడంతో అప్పట్లో అది సాధ్యం కాలేదని, తరువాత చిరంజీవితో సైతం మంతనాలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. దీంతో గంటా టీడీపీలోనే ఉన్నారా..రానున్న కాలంలో టీడీపీలోనే కొనసాగుతారా లేదా అనే గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఇక జీవీఎంసీ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడినా.. గంటా వర్గం చొరవచూపలేదన్న చర్చ కూడా నడించింది. అందుకే టీడీపీకి ఇంకా గెలిచే అవకాశం ఉన్నా.. చొరవ చూపని కారణంగా 30 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిందని పార్టీ నాయకులే చెబుతున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేను కలిసినా..
ఇక జీవీఎంసీ ఫలితాలు వచ్చాక టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మేయర్ అభ్యర్థి పీలా శ్రీనివాస్, పులి లక్ష్మీబాయి, గంధం శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాస రావు, లేళ్ల కోటేశ్వరరావు, బొండా జగన్నాథం, మొళ్లి ముత్యాలు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కలిశారు. అయితే ఈ విషయం గంటా శ్రీనివాసరావు వర్గానికి ముందే తెలుసని, అయినా స్పందించలేదనే చర్చ కూడా నడుస్తోంది. తరువాత జరిగిన పార్టీ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యుల సమావేశానికి కూడా దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావుపై పార్టీ అదిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో గంటా పార్టీలోనే ఉంటారా.. వేరే నిర్ణయం తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.
Must Read ;- కేటీఆర్‌ను కలిసిన గంటా.. విశాఖ వస్తామన్న తెలంగాణ మంత్రి