అధికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలపై కన్నేసింది. పార్టీలోకి దేశం సీనియర్లను లాగేసి అక్కడ ప్రతిపక్షం ఉనికి లేకుండా చేయాలన్నది అధికార వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటికే పంచకర్ల రమేష్ తో పాటు ఒకరిద్దరు సీనియర్లను పార్టీలోకి లాగేసిన అధికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మిగిలిన వారిపై కూడా కన్నేసింది.
ముఖ్యంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ మహిళ అధ్యక్షురాలు అనితలను ముందుగా పార్టీలోకి తీసుకుని ఆ తర్వాత మిగిలిన వారిని ఆపరేషన్ ఆకర్ష ద్వారా అధికార పార్టీలోకి ఆహ్వానించాలన్నది ముఖ్యమంత్రి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటి వరకూ గంటా శ్రీనివాస రావు పార్టీలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలను జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు అడ్డుకుంటున్నారు. గంటా శ్రీనివాస రావు పార్టీలోకి వస్తే తనకు ప్రాధాన్యం తగ్గిపోతుందనే భయం మంత్రి ముత్తంశెట్టిలో రోజురోజుకు పెరుగుతోంది. గంటా శ్రీనివాస రావు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారిపోతారని, ఆయన అధికారం కోరుకునే మనిషంటూ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు పదే పదే ప్రకటిస్తున్నారు.
దీనికి కారణం తన ప్రాభాల్యం తగ్గకుండా చూసుకోవడమే అని విశాఖలోని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, రెండు రోజుల క్రితం జరిగిన ఓ కీలక సమావేశంలో మాత్రం గంటాను పార్టీలోకి తీసుకురావడం ఖాయమైందని అంటున్నారు
వాళ్లని రానివ్వండి… మీకేం కాదు.. సీఎం భరోసా
మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుతో పాటు విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి చెందిన వారిని పార్టీలోకి ఆహ్వానించాలని, దానికి ఎవరూ అడ్డుతగలవద్దంటూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లా నాయకులకు హితబోధ చేసినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం మంత్రి ముత్యంశెట్టి శ్రీనివాస రావు తన కుమారుడితో కలిసి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంను మర్యాద పూర్వకంగా కలిసారు.
ఆ సమయంలో గంటా శ్రీనివాస రావుతో పాటు మిగిలిన తెలుగుదేశం నాయకుల చేరికల గురించి పెద్దగా ఆలోచించవద్దని, వారిలో ఎవరు పార్టీలోకి వచ్చినా ఆహ్వానించాల్సిందేనని మంత్రికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హితబోధ చేసినట్లు సమాచారం. రాజధానిని విశాఖలో ఏర్పాటు చేస్తున్న పమయంలో అక్కడ ప్రతిపక్షం ఎంత బలహీనంగా ఉంటే అధికార పార్టీకి అంత మంచిదని సీఎం అన్నట్లు చెబుతున్నారు.
ఈ వాదనతో మంత్రి ముత్తంశెట్టి కూడా ఏకీభవించినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో కొందరిని కొన్ని విధాలుగా లొంగదీసుకోవాలని, మరికొందరికి పార్టీలోకి అవకాశం కల్పించుకుని మనవైపు తిప్పుకోవాలని సీఎం ఉద్బోధ చేసినట్లు చెబుతున్నారు.
మూహుర్తమే మిగిలింది.. చేరికలు ఖాయం..
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్లు అధికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైపోయిందని, ఇక ముహూర్తమే మిగిలిందని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చేసిన ఉపదేశంతో కొందరు నాయకులు అలకలు కూడా వీడారని అంటున్నారు. ముందు తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసే ప్రక్రియ పూర్తి చేయాలని, ఆ తర్వాత ఏం చేయాలో అది జరుగుతుందని సీఎం అన్నట్లు చెబుతున్నారు. గంటా శ్రీనివాస రావు తెలుగుదేశం వీడకుండా చూడాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా నాయకులకు చెప్పినా… అది కార్యరూపం దాల్చదని తెలుగుదేశం నాయకులే అంటున్నారు.











