మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి షాక్ ఇచ్చారు. శుక్రవారం ఉదయం ఆయన పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపానని చెప్పారు. అయితే ఆయన త్వరలో టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇటీవలనే దళిత బంధుపై కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి మోత్కుపల్లి హాజరుకావడం.. కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించిన నేపథ్యంలో కారెక్కుతారని విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయితే మోత్కుపల్లి టీఆర్ఎస్‌లో చేరితే ఆయనకు ఏమైనా పదవి ఇస్తారా..? లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మోత్కుపల్లి పదే పదే కేసీఆర్ పై ప్రశంసలు కురిపిస్తుండటంతో బీజేపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. అందుకే మోత్కుపల్లిని దూరం పెట్టినట్టు వార్తలు వచ్చాయి.
ఈటలపై ఘాటు వ్యాఖ్యలు
బీజేపీకి రాజీనామా ప్రకటించిన ఆనంతరం మోత్కుపల్లి ఈటల రాజేందర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు తనతో ఒక్కమాట కూడా చెప్పకుండానే ఈటలను పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. ఈటలను పార్టీలో చేర్చుకోవడం తనను బాధించిందని అన్నారు. ఈటలను నెత్తిన మోయాల్సిన అవసరం బీజేపీకి ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈటల ఒక అవినీతిపరుడని, దళితుల భూములను ఈటల ఆక్రమించుకున్నారని విమర్శల వర్షం కురిపించారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్నా తనను బీజేపీ ఉపయోగించుకోలేదని మోత్కుపల్లి వ్యాఖ్యలు చేశారు.
Must Read ;- ఈటల క్వశ్చన్..! దళిత సీఎం ఎటుపోయింది?