Revanth Reddy :
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఊహించని రీతిలో దూసుకుపోతున్నారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లను, జూనియర్లను ఒకేతాటి మీదికి తెస్తూ కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకొస్తున్నారు. పార్టీ వ్యతిరేకులను కలుపుకోవడంలో సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి.. ‘కాంగ్రెస్ ఘర్ వాపసీ’ పేరుతో కాంగ్రెస్ ను వీడిన నాయకులను తిరిగి పార్టీలోకి చేర్చుకునేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రేవంత్ చొరవతో కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీల్లో చేరినవారు తిరిగి.. హస్తం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని రేవంత్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. తాను కాంగ్రెస్‌లో త్వరలో చేరనున్నట్లు విశ్వేశ్వర్‌రెడ్డి సంకేతాలిచ్చారు. మరోవైపు టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ సైతం కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు ఇంటి దొంగలను ఏరివేస్తూనే.. కాంగ్రెస్ నమ్మకంగా ఉండే కార్యకర్తలు, నాయకులను కలుస్తూ పార్టీకి పూర్వవైభవం దిశగా ముందుకు సాగుతున్నారు.
Revanth Reddy :
పెట్రోల్, డీజిల్ ధరలపై కొట్లాట
పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసిస్తూ కాంగ్రెస్ రాష్టమంతటా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. గతంలో అధిష్ఠానం ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తూతూమంత్రంగా పాల్గొనేవాళ్లు. కానీ రేవంత్ రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని చెప్పక తప్పదు. ప్రెటోల్ ధరల పెంపునకు నిరసనగా రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సైకిళ్లు, ఎడ్లబండ్లు, రిక్షాలతో భారీ ర్యాలీ నిర్వహించి డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుపై కదం తొక్కారు. పెట్రోల్,డీజిల్ ధరల పెంపుతో పేదోడి రక్తం తాగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా నిర్మల్ లో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్ లో ఎక్కడాలేని జోష్ ను నింపారు. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా మరోసారి ‘చలోరాజ్ భవన్’ కు పిలుపునిచ్చారు. వరుస నిరసన కార్యక్రమాలు, ఇతర నాయకులతో భేటీలు, చేరికలు, మంతనాలు చేస్తూ అధికార పార్టీకి ముచ్చెటమలు పట్టిస్తున్నారు.
Must Read ;- కేటీఆర్‌పై రేవంత్ పైచేయి.. ఎలాగో తెలుసా?
హుజూరాబాద్ ను చేజిక్కించేందుకు..
హుజూరాబాద్ ఎన్నికలతో పాటు పార్టీని పటిష్టం చేసేందుకు కాంగ్రేస్ నేతలు నడుంబిగించారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డి రాజీనామాతో లైన్ క్లియర్ అయింది. దీంతో నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాను ముమ్మరం చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేశారు. వాటిని అమలు చేసేందుకు గాను పార్టీ ఇంచార్జులు, సమన్వయ కర్తలు, మండల ఇంచార్జులను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జిగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ గా ప్రకటించారు. ఈయనతోపాటు.. నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్తలుగా..ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబులను ప్రకటించి మరింత స్పీడును పెంచారు.