Kaushik Reddy Resigns Congress Party :
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీ పీసీసీ) చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పార్టీపై తనదైన పట్టు సాధిస్తున్నారని చెప్పక తప్పదు.తెలంగాణలో అంతకంతకూ క్షీణిస్తున్న పార్టీకి కొత్త ఊపిరిలూదే క్రమంలో తనదైన దూకుడును ప్రదర్శిస్తున్న రేవంత్.. కాంగ్రెస్ పార్టీపై వైరి వర్గాలు సంధిస్తున్న అస్త్రాలను సమర్ధంగానే తిప్పి కొడుతున్నారని చెప్పక తప్పదు.అందులో భాగంగా టీ పీసీసీ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టి వారంలోనే ఆయన ఓ కీలక అడుగు వేశారు. పార్టీకి ద్రోహం చేస్తున్నారని భావిస్తున్న హుజూరాబాద్ కు చెందిన యువనేత, పార్టీ కార్యదర్శిగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి తనకు తానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించే దిశగా రేవంత్ తనదైన వ్యూహాన్ని అమలు చేశారని చెప్పాలి.
కేటీఆర్ బుట్టలో కౌశిక్..
టీఆర్ఎస్ నుంచి దాదాపుగా బహిష్కరణకు గురైన ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఈ క్రమంలో హుజూరాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే అక్కడ బీజేపీకి అంతగా బలం లేదనే చెప్పాలి. అయినా ఈటల సామర్ధ్యాన్ని తక్కువగా అంచనా వేయలేని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తనదైన శైలి వ్యూహాన్ని రచించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ లో మంచి ఓటింగ్ శాతం కలిగిన కాంగ్రెస్ పార్టీకి అయోమయానికి గురి చేయడం ద్వారా ఆ పార్టీకి ఉన్న ఓటింగ్ ను టీఆర్ఎస్ వైపు తిప్పేసుకుంటే.. ఈటలపై టీఆర్ఎస్ కు ఈజీ విక్టరీ దక్కుతుందన్నది ఆ ప్లాన్ గా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కుతుందని భావిస్తున్న పాడి కౌశిక్ రెడ్డినితన బుట్టలో వేసుకున్నారు. కేటీఆర్ పిలవంగానే.. కౌశిక్ రెడ్డి కూడా లొంగిపోయారు. తనకు రాజకీయ ఓనమాలు దిద్దించిన హస్తం పార్టీకి ద్రోహం చేసేందుకు సిద్ధపడిపోయారు.
కౌశిక్ దొరికిపోయాడు..
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే.. కేటీఆర్ తో భేటీ అయిన కౌశిక్ కాంగ్రెస్ శిబిరంలో కలకలమే రేపారు. అయితే ఆ తర్వాత టీ పీసీసీ చీఫ్ గా ఎంపికైన రేవంత్ పకడ్బందీగానే వ్యూహం రచించినట్లుగా తెలుస్తోంది. కౌశిక్ కు విజయేందర్ అనే వ్యక్తి నుంచి ఫోన్ చేయించిన రేవంత్.. ఆ ఫోన్ కాల్ ను రికార్డింగ్ చేయించారట. ఈ ఫోన్ కాల్ లో తాను టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నానని, యువకులకు రూ.2 వేల నుంచి 3 వేల దాకా ఇద్దామని, ఈ డబ్బంతా తానే సర్దుతానని కూడా చెప్పేశారు. ఆ తర్వాత ఈ వీడియో సోమవారం విడుదలైపోయి కౌశిక్ ను అడ్డంగా బుక్ చేసింది. అయితే రేవంత్ వ్యూహం మేరకు కౌశిక్ తో ఫోన్ లో మాట్లాడిన విజయేందర్.. తాను బీజేపీ కార్యకర్తనని, కౌశిక్ లాంటి అవకాశవాదులకు బుద్ధి చెప్పేందుకే ఈ విధంగా చేశానని చెప్పుకోవడం గమనార్హం.
రాజీనామా.. ఆ వెంటనే బహిష్కరణ
ఇదిలా ఉంటే.. ఈ వీడియో బయటకు వచ్చినంతనే రేవంత్ ఆధ్వర్యంలోని పీసీసీ చాలా వేగంగా స్పందించింది.కౌశిక్ కు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నోటీసుపై కౌశిక్ స్పందించకముందే.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో భయపడిపోయిన కౌశిక్.. తనను పార్టీ నుంచి బహిష్కరించక ముందే తానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా సోమవారం సాయంత్రం ప్రకటించేశారు. కౌశిక్ ప్రకటన వచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోదండరెడ్డి ప్రకటించారు. అంతకుముందు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కౌశిక్.. ఈ నెల 16న తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా ప్రకటించారు. అయితే.. టీఆర్ఎస్ రచించిన వ్యూహంలో ఆ పార్టీనే దోషిగా నిలబెట్టిన కౌశిక్ కు కేటీఆర్ టికెట్ ఇస్తారా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది. అంటే.. కాంగ్రెస్ లో ఉంటూ టీఆర్ఎస్ కు సహకరించేలా ప్లాన్ చేసుకున్న కౌశిక్.. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారక తప్పదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ పై కేటీఆర్ సంధించిన అస్త్రాన్ని తుత్తునీయలు చేయడంలో రేవంత్ తొలి యత్నంలోనే సఫలమయ్యారన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- ట్రయాంగిల్ కాదు.. నాలుగు స్తంభాలాట