తెలంగాణలో హుజురాబాద్ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయి. ఓవైపు హుజూరాబాద్ ఉపఎన్నిక, మరోవైపు సీఎం కేసీఆర్ ప్రకటించన దళిత బంధు పథకం గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉపఎన్నికల జరుగుతున్న హుజూరాబాద్ నుంచే దళిత బంధు పథకాన్ని ప్రారంభం అవుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదనే తీవ్ర ఆరోపణలున్నాయి. ఇప్పుడు కొత్తగా దళితబంధు పథకాన్ని ప్రకటించింది. దళితుల అభివృద్ధి కోసం 50 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెప్తున్నా అమలు కావడం లేదని ప్రతిపక్షాలతో పాటు దళిత సంఘాలు విమర్శిస్తున్నాయి. దళితులపై ప్రేమ ఉంటే ఖాళీగా ఉన్న ఎస్సీ బ్యాక్‌లాక్ పోస్టుల భర్తీ, ఫీజు రీయంబర్స్ మెంట్ లాంటివి ఎందుకు గుర్తుకురావడం లేదని నిలదీస్తున్నాయి.
హుజురాబాద్ కే పరిమితమా..?
సీఎం కేసీఆర్ కు దళితుల పట్ల ప్రేమ ఉంటే… దళిత బంధును కేవలం హుజురాబాద్‌కే పరిమితం చేయొద్దని, రాష్ట్రంలో ఉన్న రిజర్వుడు నియోజక వర్గాలన్నిటిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి, ఇస్తామని 50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన పూర్తిగా విస్మరించిందని విమర్శించాయి. దళితబంధు కూడా అలాగే ఉంటుందని ఇతర పథకాల మాదిరిగా ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దళితుల అభివృద్ధి అంటే ఆర్థిక సాయమే కాదు వారికి విద్య, ఉపాధి అవకా శాలలో సరైన ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఫక్తు రాజకీయ పార్టీ
‘‘ఎలక్షన్ వుంది కాబట్టి హుజురాబాద్ లో దళిత బంధు పెట్టామంటున్నారు.. అవును పెడతాం..నేను స్వార్ధపరుడినైతే గజ్వేల్ లోనే ఈ స్కీంను పెట్టుకునే వాడిని కదా అని అన్నారు. పథకం పెట్టినప్పుడు లబ్ధి కోరుకోకూడదా.. ఏమి పెట్టని మీరు లబ్ధి కొరుకోవచ్చా.. కానీ మేము కోరుకోవద్దా’’ అని ప్రతిపక్ష పార్టీలను కేసీఆర్ ప్రశ్నించారు. ఎలక్షన్ ఉంది కాబట్టే పథకాలు పెడుతామని కేసీఆర్ పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఈటలను ఓడించడానికే కేసీఆర్ ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా? అంటూ దళిత సంఘాలు మండిపడుతున్నాయి.
Must Read ;- ఆ రెడ్డి ఇటొస్తే.. ఈ రెడ్డి అటెళ్లిపోయాడు











