కాలు పోగొట్టుకొన్న విద్యార్థికి వైద్య ఖర్చులకు సోనూ హామీ లభించింది. వివరాల్లోకి వెళితే గడికోట గ్రామం జల్లేవాండ్లపల్లెకు చెందిన వెంకటసాయి చంద్ర అనే విద్యార్థి రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు కు తీవ్ర గాయమైంది. డాక్టర్లు ఆపరేషన్ చేసి కాలును తొలగించారు. ఈవిద్యార్థి వెంకట సాయి చంద్రను ఏపీ ఎంఆర్పిఎస్ నేతలు ముంబైలోని సోనూసూద్ వద్దకు తీసుకెళ్లారు.
విద్యార్థిని చూసిన సోనూసూద్ చలించిపోయారు. ఆ విద్యార్థి ని వెంటనే మొంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి కి పంపించి వైద్య పరీక్షలు చేయించుకోమని తెలిపారు. కాలు బాగయ్యే వరకు ముంబైలోనే ఉండి చూపించుకోమని సలహా ఇచ్చారు. ఆ విద్యార్థికి వైద్య ఖర్చులు ఎంతైనా తానే భరిస్తానని సోనూ సూద్ హామీ ఇచ్చినట్లు ఏపీ ఎంఆర్పీఎస్ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ నేతలు ప్రసాద్, సంజీవ, మురళీ తదితరులు పాల్గొన్నారు.
విగ్రహావిష్కరణకు ఆహ్వానం
అంబేద్కర్ విగ్రహావిష్కరణకు కూడా సోనూ సూద్ ను ఎంఆర్పీఎస్ నేతలు ఆహ్వానించారు. కడప జిల్లా వీరబల్లి మండల నేతలు నరసింహులు, వర్ల వెంకటరమణ, రామ్మోహన్ లు సోనూను కలిసి మాట్లాడారు. ఆదివారం వీరు ముంబైలోని సోనూ సూద్ నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ మండలంలోని గడికోట గ్రామంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని వారు సోనూను ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని ఆ నేతలు మీడియాకు తెలిపారు.











