నిజమే… వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే… టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తరహా పాలన అటు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో గానీ, ఇటు ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో గానీ సాధ్యం కాదని బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు. సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో పొరుగు రాష్ట్రాలతో ఎలాంటి వివాదాలు లేకుండానే తన రాష్ట్రానికి ఏం కావాలో… అందుకు లేషమాత్రం కూడా తగ్గకుండానే పని కానిచ్చేయడం బాబు మార్కు పాలన. అదే వైఎస్ ఫ్యామిలీకి చెందిన తండ్రీకొడుకులు వైఎస్సార్, జగన్ లు తమ రాష్ట్ర అవసరాల కోసం ఇతర రాష్ట్రాలతో పోటీ మరీ సాధించాలనుకునే రకం. వెరసి రాష్ట్రాన్ని పొరుగు రాష్ట్రాల దృష్టిలో శత్రువుగా చూపడం, కేంద్రం దృష్టిలో మాట వినని రాష్ట్రంగా ముద్ర వేయించడం వీరి పాలనలోనే జరిగింది. ఇదెలాగో చూడాలంటే…. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ప్రారంభించిన రాయలసీమ ప్రాజెక్టును ఒక్కదాన్ని ప్రస్తావిస్తే సరిపోతుంది. మరి చూద్దాం పదండి.
సీమకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు
రాయలసీమ ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా.. నూటికి నూరు శాతం కరువు ప్రాంతమే. మరి కరువు నేలకు సాయం చేయాలంటే కాస్తంత ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే కదా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా… తాము ఆ ప్రాంతానికి ఏం చేశామన్న విషయాన్ని పాలకులు నిత్యం వల్లె వేయాల్సిందే కదా. మరి ఆ దిశగా అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ, ఇప్పటి వైసీపీ.. ఈ ప్రాంతం కోసం ఏం చేశాయన్న విషయానికి వస్తే.. వైఎస్ కొనసాగిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ రాయలసీమకు ఏమీ చేసిన దాఖలా అయితే లేదు. వైఎస్ సీఎం అయ్యాక… టీడీపీ చేపట్టిన ప్రాజెక్టులను కాస్తంత ముందుకు ఉరికించారు తప్పించి… ఆయన కొత్తగా ఏమీ చేయలేదనే చెప్పాలి. అంతేకాకుండా టీడీపీ హయాంలో అన్ని రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన రీతిలో నిర్మాణమైన పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచుతూ వైఎస్సార్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజలను ఏ మేర ఆగ్రహావేశాలకు గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పోనీ ఒకే రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఆంద్రలో రాయలసీమకు న్యాయం చేసేందుకు తెలంగాణకు అన్యాయం ఎందుకు చేయాలన్న దిశగానూ నాడు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి.
మరి టీడీపీ హయాంలో ఏం జరిగింది?
ఇక టీడీపీ విషయానికి వస్తే… రాయలసీమలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులన్నీ దాదాపుగా టీడీపీ హయాంలో వచ్చినవేనని చెప్పాలి. అయితే ఈ ప్రాజెక్టులకు అటు తెలంగాణ ప్రజలు గానీ, ఇతర పొరుగు రాష్ట్రాలు గానీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా అభ్యంతరం చెప్పిన దాఖలా అయితే కనిపించలేదు. తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా తదితర ప్రాజెక్టులను ప్రారంభించిన టీడీపీ… వాటికి అనుబంధంగా మరెన్నో ప్రాజెక్టులను నిర్మించింది. అందులో భాగంగా ఏర్పాటైనదే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్. కాలక్రమేణా రాయలసీమకు మరిన్ని నీటి వనరులు అవసరమైన విషయాన్ని తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గుర్తించి… అందుకు ఓ బృహత్తర పథకాన్ని ఎంచుకున్నారు. ఈ పథకాన్ని పూర్తి చేయడంతో పాటుగా దానికి అనుబంధంగా ఇంకొంత మేర పని చేసి ఉంటే.. అసలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య పెను వివాదంగా మారిన రాయలసీమ పథకం అవసరమే ఉండేది కాదు. ఆ ప్రాజెక్టే ముచ్చుమర్రి లిఫ్ట్.
ముచ్చుమర్రితో చంద్రబాబు రికార్డు
కర్నూలు జిల్లా పరిధిలోని ఈ ప్రాజెక్టుకు తెలంగాణ కాదు కదా… కర్ణాటక గానీ, మహారాష్ట్ర గానీ అభ్యంతరమే పెట్టలేదు. తుంగభద్ర నది ద్వారా కృష్ణాలో కలిసి వృథాగా సముద్రంలో కలిసిపోతున్న నీటిలో 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేందుకు ఉద్దేశించినదే ఈ ప్రాజక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిన చంద్రబాబు సర్కారు… దానిని తన హయాంలోనే పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసే నీటిని తరలించేందుకు నిర్మించాల్సిన కాలువ తవ్వకాలు మాత్రం పూర్తి కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు తాత్కాలిక ప్రాజెక్టుగానే ముద్రపడిపోయింది గానీ.. ఆ కాలువే పూర్తి అయి ఉంటే… రాయలసీమ ఇప్పుడు నీటి కోసం ఎదురు చూడాల్సిన అవసరమే వచ్చేది కాదు. అసలు ఇప్పుడు జగన్ రాయలసీమ పథకం పేరిట రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే కొత్త పథకానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరమే వచ్చేది కాదు. మొత్తంగా కరువు సీమ నీటి కరువును తీర్చేందుకు చంద్రబాబు.. ఏ మాత్రం వివాదం రేకెత్తని విధంగా ముచ్చుమర్రి ప్రాజెక్టును ఎంచుకుని తన పాలనా పటిమను చూపించారు.
వివాదాల జగన్ పాలన అంతా వివాదమే
ఇక ఇప్పుడు ఏపీకి సీఎంగా ఉన్న జగన్ విషయానికి వస్తే.. చంద్రబాబు సర్కారు హయాంలో పూర్తి అయిన ముచ్చుమర్రి ప్రాజెక్టుకు అనుబంధంగా కాలువ తవ్విస్తే సరిపోతుందని జగన్ కు తెలుసు. అయితే చంద్రబాబు కట్టిన ప్రాజెక్టును తాను ఎందుకు కొనసాగించాలి? అన్న ఓ రకమైన మనస్తత్వం. అయితే సేమ్ టూ సేమ్ ముచ్చుమర్రి తరహాలోనే పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ పథకం పేరిట మరో పథకానికి శ్రీకారం చుట్టారు. అసలే తన తండ్రి వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై తెలంగాణ జనం ఏ రీతిన నిరసన వ్యక్తం చేశారన్న విషయం తెలిసి కూడా.. మళ్లీ పోతిరెడ్డిపాడునే జగన్ ముట్టుకున్నారు. తన తండ్రి పెంచిన పోతిరెడ్డిపాడు సామర్థ్యం సరిపోదన్నట్లుగా ఇప్పుడు దానిని మరింత మేర సామర్ధ్యం పెంచేందుకు పూనున్నారు. సరే… కొత్త ప్రాజెక్టు అయితే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలి కదా. అదేమీ లేకుండానే… కేంద్రానికి కనీసం సమాచారం ఇవ్వకుండానే రాయలసీమ పథకాన్ని ప్రారంభించేశారు. పొరుగు రాష్ట్రాలు కళ్లు మూసుకుని ఏమీ ఉండవు కదా.,. జగన్ సర్కారు కదలికలను కనిపెట్టి కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో పాటుగా ఏకంగా ఏపీ సర్కారు తీరుపై ఓ రేంజిలో విరుచుకుపడుతోంది. మొత్తంగా చెప్పొచ్చేదేమంటే… బాబు తరహా స్మూత్ పాలన ఇటు వైఎస్సార్ కు గానీ, ఇటు జగన్ కు గానీ చేత కాదనే చెప్పాలి.