విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. వంద రూపాయల కోసం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ చివరకు హత్యకు దారి తీసింది. విజయవాడ అజిత్‌సింగ్ నగర్ ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నం సెంట్రింగ్ కార్మికుల మధ్య వివాదం మొదలైంది. వంద రూపాయల కోసం వివాదం చోటు చేసుకుంది. చివరకు రెండు వర్గాలు కత్తులు, కర్రలు, బ్లేడ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో పండు అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు, దర్యాప్తు ప్రారంభం
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వంద కోసమే వివాదం మొదలై చివరకు హత్యకు దారితీసిందా? లేదంటే వారి మధ్య పాత తగాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. వాంబే కాలనీలో జరిగిన ఘటనతో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Also Read:కనకదుర్గ గుడిలో దండుపాళ్యం గ్యాంగ్ చేరింది.. పోతిన మహేష్