మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లు అవుతున్నా ఈ కేసులో ఇంత వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం దారుణమని ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఏపీలో జగన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చినా వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంత వరకూ ఒక్క అడుగు ముందుకు పడలేదని సునీతారెడ్డి గుర్తు చేశారు. వివేకానందరెడ్డి హత్య వెనుక ఎవరున్నారో సీబీఐ అధికారులు నిగ్గు తేల్చాలని సునీతారెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు, ఇంకెంత మంది చనిపోతారో అని భయంగా ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి..
వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు ఇప్పటికీ స్వేచ్ఛగానే తిరుగుతున్నారని, మా తండ్రి హత్య కేసు ఇంకా మిస్టరీగానే మిగిలి ఉందని సునీతారెడ్డి అన్నారు. వివేకానందరెడ్డి హత్య జరిగి ఇప్పటికే రెండేళ్లు అయింది, న్యాయం కోసం ఇంకెంత కాలం నిరీక్షించాలని ఆమె ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం ఉండి కూడా తమకు న్యాయం జరగకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ పెద్దలే దీనికి సమాధానం చెప్పాలని సునీత డిమాండ్ చేశారు. రాజకీయ ప్రమేయంతో హత్య జరిగిందని తాను భావిస్తున్నానన్నారు. ఒక సీనియర్ అధికారిని కలసినప్పుడు కడపలో ఇలాంటివి కామన్ అన్నారని ఆమె గుర్తు చేశారు. అధికారులు ఇలా ఎలా మాట్లాడతారని సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ అధికారులు చేధించాలని ఆమె విజ్ఙప్తి చేశారు.