తమిళ హీరో కార్తి, రష్మిక మందన్న జంటగా రూపొందిన చిత్రం ‘సుల్తాన్’. భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై యస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఖైదీ లాంటి హిట్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కార్తికి ఈ ‘సుల్తాన్’ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం.
కథలోకి వెళితే..
ఇది పూర్తిగా యాక్షన్ డ్రామాతో రూపొందిన చిత్రం. రౌడీయిజంతో ముడిపడిన ఓ కుటుంబం నుంచి వచ్చిన వారసుడు తన తల్లిదండ్రుల మాటకు విలువనిచ్చి ఏంచేశాడన్నదే ప్రధాన కథాంశం. సుల్తాన్ (కార్తి) ఈ భూమ్మీద పడగానే తల్లిని కోల్పోతాడు. అతని తల్లి (అభిరామి) కోరిక మేరకు సుల్తాన్ ను రౌడీయిజానికి దూరంగా పెంచుతాడు తండ్రి సేతుపతి (నెపోలియన్). వైజాగ్ లో ప్రారంభమైన ఈ రౌడీల అడ్డా అమరావతికి మారడం వెనక పెద్ద కథే ఉంటుంది. అమరావతిలోని ఓ రౌడీ బారి నుంచి తమ భూముల్ని కాపాడాలని ఆ ఊరి ప్రజల కోరిక మేరకు ఈ రౌడీ బృందమంతా అమరావతి వెళ్లాల్సి వస్తుంది.
వీరు అమరావతికి వెళ్లకముందే సుల్తాన్ తండ్రిని కోల్పోవలసి వస్తుంది. అమరావతిలో రుక్మిణి (రష్మ క)ను చూడగానే సుల్తాన్ ప్రేమలో పడతాడు. అమరావతి ప్రజలకు తండ్రి ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు సుల్తాన్ ఇంట్లో రౌడీ బృందమంతా అమరావతికి బయలుదేరుతుంది. తమ ఇంట్లో ఉండే రౌడీలందరినీ సొంత అన్నల్లా భావిస్తాడు సుల్తాన్. పోలీసుల నుంచి వారి ప్రాణాలను కాపాడాలన్నది సుల్తాన్ వ్యూహం. అమరావతిలోని రౌడీ మూకల ఆటకట్టించడంలో వైజాగ్ రౌడీలు ఏంచేశారు? ఈ అమరావతిలో సుల్తాన్ కు ఎదురైన సవాళ్లు ఏమిటి? వాటిని అతను ఎలా అధిగమించాడు అన్నదే ఈ సినిమా. కథ రొటేనే అయినా కథనంలో ప్రత్యేకతను దర్శకుడు చూపగలిగాడు.
ఎలా తీశారు? ఎలా చేశారు?
సుల్తాన్ గా కార్తి మరోసారి పవర్ ఫుల్ పాత్రను పోషించాడు. పాత్ర పరిధి మేరకే నటించడం కార్తిలోని ప్రత్యేకత. అది ఈ సినిమాలో కూడా కనిపించింది. ఖైదీలో కనిపించిన పవర్ ఫుల్ కార్తిని ఇందులో కూడా చూడవచ్చు. ఒకే పాత్రలోని భిన్న పార్శ్వాలను దర్శకుడు చక్కగా ఆవిష్కరించాడు. కార్తి తల్లిగా అభిరామి కొద్ది సేపు మాత్రమే తెరపై కనిపిస్తుంది. తండ్రిగా నెపోలియన్ కు మరోసారి మంచి పాత్రను పోషించగలిగే అవకాశం వచ్చింది. నెపోలియన్ దగ్గర ఉండే నమ్మినబంటు పాత్రను మలయాళ నటుడు లాల్ చక్కగా పోషించాడు. ప్రథమార్థమంతా వినోదంతో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ ను ఓ రేంజ్ లో దర్శకుడు తెరకెక్కించగలిగాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ మరో బాషాను తలపిస్తుంది.
అమరావతిలో ఉండే రౌడీ పాత్ర జయేంద్ర (రామచంద్రరాజు) పాత్రను కూడా పవర్ ఫుల్ గా దర్శకుడు తీర్చిదిద్దగలిగాడు. మాస్ మసాలా ఎంటర్ టైనర్ సినిమాను మలిచారు. ప్రథమార్థంలో ఉన్న స్పీడు ద్వితీయార్థంలో తగ్గింది. నిడివి ఎక్కువ కావడం కూడా దీనికి కొంత కారణం. ఫైట్స్, సాంగ్స్, ఎమోషన్స్, కామెడీ వంటి కమర్షియల్ అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా డైలాగులను రచయిత చక్కగా రాశారు. పాత సన్నివేశాలే అయినా వాటిలో ఓ స్థాయి కిక్ ఉంటుంది. అమరావతిలో ఓ రైతు కూతురిగా రష్మిక నటించింది. ఎందుకోగాని మునుపటి గ్లామర్ ఆమెలో కనిపించలేదు.
డైటింగ్ ప్రభావం ఆమె మొహంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. రష్మికకు ఇది మొదటి తమిళ సినిమా. కార్తి, రష్మికల కెమెస్ట్రీ బాగానే వర్కవుట్ అయ్యింది. మలయాళ నటుడు లాల్ కూడా ఈ సినిమాకి ఎస్సెట్ అయ్యాడని చెప్పవచ్చు. ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ నేపథ్య సంగీతం. ప్రథమార్థంలాగా ద్వితీయార్థం కూడా ఉండి ఉంటే ఈ ‘సుల్తాన్’ మరో ‘బాషా’ అయి ఉండేది. ఇప్పటికైనా ద్వితీయార్థంలోని కొన్ని అనవసర సన్నివేశాలను తొలగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
నటీనటులు : కార్తి, రష్మిక మందన్న, యోగిబాబు, నెపోలియన్, లాల్, రామచంద్రరాజు, అభిరామి, నవాబ్ షా, నాగినీడు తదితరులు
సంగీతం : వివేక్- మెర్విన్
నేపథ్య సంగీతం: యవన్ శంకర్ రాజా
ఎడిటర్: రూబెన్
సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్
నిర్మాణం: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
నిర్మాతలు : ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు
దర్శకత్వం : భాగ్యారాజ్ కణ్ణన్
విడుదల : 02-04-2021
ఒక్క మాటలో: బాక్సాఫీసు పాదుషా
రేటింగ్: 3/5
Also Read:విజయ్ – రష్మిక మరోసారి కలిసి నటించనున్నారా?