అధికారం ఉన్నది కదా అని చెలరేగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార సరళి.. ప్రజలకు చిత్రంగా కనిపిస్తోంది. ‘మొగుణ్ని కొట్టి మొగసాల కెక్కినట్టు’ అని పల్లెసీమల్లో సామెత చెప్పినట్టుగా.. వైసీపీ నాయకులు.. తామే బెదిరింపులకు పాల్పడడం మాత్రమే కాకుండా, ప్రత్యర్థుల మీద అలాంటి పితూరీలు చెబుతున్నారు. ప్రత్యర్థుల మీద పెట్టిన కేసులు మాత్రమే.. అరెస్టుల వరకు వెళుతుండడం విశేషం.
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. స్వగ్రామం నిమ్మాడ లో ఆయనను అరెస్ట్ చేసి కోటబొమ్మాళి పోలీసు స్టేషన్ కు తరలించారు. నామినేషన్ వేయనీయకుండా సర్పంచ్ అభ్యర్ధిని బెదిరించారంటూ వైసిపి నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంతకూ ఏం జరుగుతోంది?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయిష్టంగానే పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగింది. అయినా సరే.. తమకు పట్టు ఉన్నట్టుగా నిరూపించుకోవాలని, ప్రజాదరణ వెల్లువెత్తుతున్నట్లుగా చాటుకోవాలని ఉబలాటపడుతోంది. ఇందుకు వారు ప్రధానంగా రెండు మార్గాలు ఎంచుకున్నారు. బెదిరింపుల ద్వారానో, ప్రలోభాల ద్వారానో ఏదో ఒక రీతిగా.. వీలైనన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవడం ఒక మార్గం. ఇక పోతే.. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ, కీలక నాయకుల స్వగ్రామాల్లో తమ పార్టీ వారిని గెలిపించుకోవడం ద్వారా.. వారికి ప్రజాదరణ లేదని, వారి గ్రామాల్లో కూడా తమనే ప్రజలు కోరుకుంటున్నారని టముకు వేసుకోవడం.
మరో రకంగా చెప్పాలంటే.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వీలైనన్ని గ్రామాలను చేజిక్కించుకుంటే.. పరోక్షంగా తెలుగుదేశం హవా మరింత దిగజారిందని, తమనే ప్రజలు ఆదరిస్తున్నారని చాటుకోవాలనేది వారి కల. అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే.. అచ్చెన్నాయుడు స్వగ్రామం అయిన నిమ్మాడ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. దానికి తోడు.. అచ్చన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా అయ్యేసరికి మరింత కాన్సంట్రేట్ చేశారు.
ఆ నేపథ్యంలో భాగంగానే కింజరాపు కుటుంబానికే చెందిన వ్యక్తిని నిమ్మాడలో సర్పంచి అభ్యర్థిగా మోహరించారు. అదేసమయంలో అచ్చెన్నాయుడు భార్య స్వయంగా బరిలోకి దిగింది.
నామినేషన్ రోజున నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడకు రావడం, ఆయన అనుచరులతో వీరంగం సృష్టించడం ఇదంతా అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరిాంచి.. ఉద్రిక్తతలను నివారించే ప్రయత్నం చేశారు. రెండో వైపు నుంచి, తమ కుటుంబానికే చెందిన వైసీపీ అభ్యర్థితో అచ్చెన్నాయుడు ఫోన్లో మాట్లాడడం మాత్రమే జరిగింది. నామినేషన్ నాడు.. ఇరుపార్టీల వారి మధ్య తోపులాటలతో ఉద్రిక్త వాతావరణ కూడా నెలకొంది.
అయితే.. ఈ పరిణామాలను సాకుగా వాడుకున్న అధికార పార్టీ తర్వాతి ఎత్తుగడకు దిగింది… వైఎస్సార్ సీపీ నాయకుల ఫిర్యాదు మేరకు, అభ్యర్థిని బెదిరించాడనే ఆరోపణలతో ఇప్పుడు అచ్చెన్నాయుడును అరెస్టు చేశారు. ఈ వ్యవహారం చూస్తే.. నిమ్మాడలో నానా వీరంగం సృష్టించడం మాత్రమే కాకుండా.. వారే అచ్చెన్నపై పోలీసుకేసు పెట్టడం, అరెస్టు చేయించడం చూస్తోంటే.. మొగుణ్ని కొట్టి మొగసాల కెక్కిన సామెత చందంగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.
Must Read ;- అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్