వంగవీటి రాధాకృష్ణ.. ఒక్క విజయవాడలోనే కాకుండా యావత్తు ఏపీ వ్యాప్తంగా రీసౌండ్ తో వినిపించే పేరు. అనుచర వర్గంలో వంగవీటిని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. మాస్ తో పాటు క్లాస్ కూడా ఇష్టపడే నేత వంగవీటి. తన సొంత సామాజిక వర్గంతో పాటుగా దాదాపుగా అన్ని సామాజిక వర్గాలతో ఇట్టే కలిసిపోయే తత్వం కూడా వంగవీటి సొంతం. అయితేనేం.. ఇప్పటిదాకా ఆయన ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే కాగలిగారు. మస్తు ఫాలోయింగ్ ఉన్నా.. దానిని సరిగ్గా వినియోగించుకోవడంలో వంగవీటి సఫలం కాలేకపోతున్నారన్నది విశ్లేషకుల మాట. అంతేనా… తన రాజకీయ భవిష్యత్తును ప్రణాళికాబద్ధంగా నిర్మించుకోవడంలోనూ ఆయన రాణించలేకపోయారని కూడా గుసగుసలు వినిపిస్తాయి. ఇదంతా నిన్నటిమాట. ఇకపై వంగవీటి రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదు. టీడీపీలో వంగవీటి ప్రాధాన్యతకు ఢోకా లేదని… ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఒక్కటంటే ఒక్క పరామర్శతో తేల్చి చెప్పేశారు.
దివంగత వంగవీటి మోహన రంగ రాజకీయ వారసుడిగా రాధాకృష్ణకు అపారమైన ఫాలోయింగ్ ఉంది ఈ ఫాలోయింగ్ ను నిలబెట్టుకునే సత్తా కూడా రాధా సొంతమనే చెప్పాలి. అయితే రాజకీయంగా ఆయన వేసిన కొన్ని అడుగులు ఆయనను ఎదగనీయకుండా చేశాయన్న విశ్లేషణలున్నాయి. కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరిపోయిన రాధా… ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదిలో మంచి ప్రాధాన్యమే ఇచ్చారు. ఇక రాధా దశ తిరిగిపోయినట్టేనని అంతా అనుకున్నారు కూడా. అయితే సరిగ్గా ఎన్నికలు వచ్చేసరికి తనకు బలమున్న సీటు కాకుండా…వేరే సీటు నుంచి పోటీ చేయాలంటూ జగన్ నుంచి వచ్చిన ఆదేశాలతో రాధా హతాశులయ్యారు. ఇదేమిటని ప్రశ్నించిన రాధాకు.. ఇక్కడ ఇంతేనని సమాధానం వచ్చింది. అంతే.. వైసీపీలో ఇమడటం తన వల్ల కాదని రాధా నిర్ధారించుకున్నారు. అనుకున్నదే తడవుగా వైసీపీ నుంచి బయటకు వచ్చారు.
కొంతకాలం తన రాజకీయ భవిష్యత్తుపై తన అనుచరవర్గంతో సుదీర్ఘ మంతనాలు జరిపిన రాధా… చివరగా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ నుంచి కూడా ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. అయితే అప్పటికే ఎక్కడికక్కడ పోటీకి నేతలు సిద్ధమైపోయిన నేపథ్యంలో టీడీపీలోనూ రాధాకు టికెట్ దక్కలేదు. అయితే వైసీపీలో ఎదురైన అవమానం అయితే టీడీపీలో తనకు ఎదురుకాలేదు. దీనిపై ఆత్మ పరిశీలన చేసుకున్న రాధా… టీడీపీలో మరింత కాలం వేచి చూద్దామన్న భావనకు వచ్చారు. ఈలోగా 2024 ఎన్నికల్లో టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి రికార్డు మెజారిటీ విజయంతో ఏపీలో అధికారం చేపట్టింది. అదే సమయంలో రాధా అస్వస్థతకు గురయ్యారు. ఫలితంగా కొంతకాలం ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చింది. సరిగ్గా.. మంగళవారం ఓ పెద్ద భరోసా రాధా ఇంటికి నడుచుకుంటూ వచ్చింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం సాయంత్రం తుళ్లూరు పరిధిలోని ప్రాతూరు గ్రామానికి వచ్చి రాధాను పరామర్శించారు. వరుసగా 3 రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన లోకేశ్… విజయవాడ తిరిగి రాగానే.. రాధాను పరామర్శించేందుకు ప్రాతూరు వెళ్లారు. తన యోగక్షేమాలు తెలుసుకునేందుకు వచ్చిన యువనేతను చూసి రాధా ఉబ్బితబ్బిబ్బయ్యారు.ఈ సందర్భంగా రాధా ఆరోగ్యం గురించి లోకేశ్ ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలంటూ ఆకాంఓించారు. ఈ సందర్భంగా రాదా తల్లి రత్నకుమారి, ఆయన సతీమణిలను కూడా లోకేశ్ పలకరించారు. రాధా కోసం స్వయంగా లోకేశ్ రావడాన్ని చూసిన వంగవీటి అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీలో ఇప్పుడంతా లోకేశ్ ఆదేశానుసారమే సాగుతున్న వేళ.. రాధా కోసం లోకేశ్ రావడం అంటే.. రాధాకు ఇక గుడ్ టైం స్టార్ట్ అయినట్టేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.