ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైన వైసీపీకి ఆ తర్వాత కూడా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పార్టీలో కీలక నేతలని, పార్టీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులని, ఆయనకు నమ్మిన బంటులనీ పేరున్న నేతలంతా వరుసగా పార్టీని వీడుతున్నారు. ఆ వెంటనే నేరుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరిపోతున్నారు. జగన్ కు సమీప బంధువు, ఆయనకు వరుసకు మామ అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మొదలైన ఈ పార్టీ మార్పులు అంతకంతకూ ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలు జనసేనలో చేరిపోయారు. ఇలా వైసీపీని వీడి తన పార్టీలో చేరిన నేతలకు పవన్ కల్యాణ్ కీలక బాధ్యతలు అప్పగిస్తూ సాగుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే… కొన్నాళ్లకు జనసేనలో ఉండే వాళ్లంతా వైసీపీని వీడి వచ్చిన నేతలేనని చెప్పక తప్పదు.
వైసీపీ వీడి జనసేనలో చేరిన నేతలు బాలినేనితోనే మొదలు కాలేదు. గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి 2019లో ఎమ్మెల్యేగా గెలిచి 2024 ఎన్నికల్లో గుంటూరు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిలారు రోశయ్య… ఎన్నికలు ముగియగానే చడీచప్పుడు కాకుండా వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు. ఆ తర్వాత బాలినేని, ఆపై సామినేని ఉదయబాను, త్వరలోనే జోగి రమేశ్.. ఇలా ఈ జాబితా పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఈ జాబితాలోకి ఏపీ మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా చేరిపోయారు. ఇక జనసేన తరఫున 2019 ఎన్నికల్లో విజయం సాదించిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా తిరిగి తన సొంత గూడు జనసేనకే చేరిపోయారు. ఇలా ఒకరి తర్వాత మరొకరుగా వైసీపీని వీడటం జనసేనలోకి చేరిపోవడం పరిపాటిగా మారిపోయేలా ఉంది.
ఇక వైసీపీని వీడేందుకు దాదాపుగా ఓ నిర్ణయం తీసుకున్నట్లుగా మేకతోటి సుచరిత మీద పెద్ద ఎత్తున వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సుచరిత రాజకీయాలకు కొత్తే అయినా.. జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలగిన నేతల్లో ఒకరిగా ముద్రపడిపోయారు. అందుకే కాబోలు… జగన్ సీఎం కాగానే..తన కేబినెట్ లోకి సుచరితను తీసుకుని ఆమెకు ఏకంగా హోం మంత్రిత్వ శాఖను అప్పగించారు. హోం మంత్రిగా ఓ మోస్తరుగా రాణించిన సుచరితకు నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శకునిలా పరిణమించారు. సుచరిత సొంత జిల్లా గుంటూరులో అనధికారికంగా ప్రవేశిస్తూ అదికారిక కార్యక్రమాల్లోనూ పాలుపంచుకున్న సజ్జల…సుచరితను దాదాపుగా మరుగున పడిపోయేలా చేశారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారం జగన్ దాకా వెళ్లినా… సజ్జల పద్ధతిలో మార్పు రాలేదు. ఈలోగా మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో సుచరితను జగన్ పక్కన పెట్టేశారు. ఆమె స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన తానేటి వనితకు అప్పజెప్పారు.
నాడు తనను పక్కనపెట్టిన జగన్ తీరును నిరసిస్తూ వైసీపీని వీడేందుకు సుచరిత సిద్ధపడిపోయారు. అయితే జగన్ నెరపిన రాయబారంతో సుచరిత వెనక్కు తగ్గారు. ఆ సందర్భంగా వైసీపీ అధిష్ఠానాన్ని, జగన్ ను సుచరిత దాదాపుగా దూషించినంత పనిచేశారు. జగన్ పిలుపుతో ఆయనతో భేటీ అయ్యేందుకు వచ్చిన సందర్భంగానూ ఆమె వైసీపీ పట్ల ఘాటు వ్యాఖ్యలే చేశారు. అయితే జగన్ బుజ్జగింపులతో సుచరిత పార్టీని వీడకుండా ఉండిపోయారు. తాజాగా వైసీపీకి దక్కిన ఘోర పరాభవం, ఆపై పార్టీని వీడుతున్న నేతలను చూస్తున్న సుచరిత… తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వైసీపీని వీడాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా వైసీపీని వీడిన తర్వాత జనసేనలో చేరాలని కూడా ఆమె నిర్ణయం తీసుకున్నట్లు ఆమె అనుచరవర్గాలే చెబుతున్నాయి.