( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
వాహనాల హారన్ల మోతతో… కుర్ర కారు కేరింతలతో సాగర తీర హోరును మైమరపించే న్యూ ఇయర్ వేడుకలు విశాఖలో ఈ ఏడాది సాదా సీదాగా జరగనున్నాయి. ఎంత తక్కువగా వేసుకున్నా విశాఖలో స్టార్ హోటళ్లు, క్లబ్‌లలో, గేటెడ్ కమ్యూనిటీలలో, క్రీడా ప్రాంగణాలతో కలిపి సుమారు 50కి పైగా ఎంటర్‌టెయిన్మెంట్ కార్యక్రమాలతో విశాఖలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వారు. భూమి కంపించేలా డీజేల సౌండ్‌తో విశాఖ ఉర్రూతలూగేది. అంబరాన్నిఅంటే నూతన సంవత్సర సంబరాలు ఈ ఏడాది కరోనా వైరస్ ఖాతాలో చేరిపోయినట్టే. కొత్త సంవత్సరాది వేడుకలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖ కేరాఫ్‌గా నిలుస్తోంది. నగర పరిధిలో ఉన్న పదికి పైగా క్లబ్‌లలో సభ్యుల కోసం ప్రతి యేటా లక్షలాది రూపాయలు వెచ్చించి ఎంటర్‌టెయిన్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ముంబై, చెన్నై, గోవా, కోల్‌క తా, బెంగళూరు వంటి ప్రాంతాల మోడల్స్, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, యాక్టర్స్ విశాఖలో ప్రదర్శన ఇచ్చేవారు. వీటితో పాటు గేటెడ్ కమ్యూనిటీలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. స్టార్ హోటళ్లలో ఒక్కో జంట కోసం రూ. 5 వేలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. సాధారణ రోజుల కన్నా డిసెంబర్ 31 రాత్రి నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు అయిదు నుంచి పది రెట్లు అధికంగా రెమ్యూనరేషన్ చెల్లించి ఆర్టిస్టులతో ఎంటర్‌టెయిన్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు.
వేలాది మందికి సాగర తీరం వేదిక..
మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి … అనేక మంది యువత.. కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసే ప్రాంతం విశాఖలోని సాగర తీరం. ప్రతి ఏటా కనీసం 50 వేల మందికి పైగా 31 రాత్రి ఇక్కడకు చేరుకుంటారు. స్టార్ హోటల్ నుంచి వినిపించే డీజేలా మోత, 12 గంటలకు కళ్ళు మిరుమిట్లుగొలిపే బాణాసంచా వెలుగుల కోసం వందలాది మంది సాగర తీరానికి చేరుకుంటారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ కొత్త సంవత్సరం సాదరంగా ఆహ్వానిస్తారు. ఈ క్రమంలో సైలెన్సర్ లేని వాహనాల శబ్దాలు.. అడ్డూ అదుపూ లేని వాహన వేగం.. విశాఖ వాసులకు కొత్తేమీ కాదు. కానీ పోలీసులు కూడా చూసీచూడనట్లు వదిలేయడం పరిపాటిగా వస్తోంది.
అన్నిటికీ చెక్..
విశాఖలో ఈ ఏడాది స్టార్ హోటళ్లలో గాని ఇతర ప్రదేశాల్లో గాని ఎటువంటి ఎంటర్‌టెయిన్మెంట్ కార్యక్రమాలకు అధికారులు ఇప్పటి వరకుఎలాంటి అనుమతులు జారీ చేయలేదు. ఇప్పటికిప్పుడు అనుమతులు ఇచ్చినా కార్యక్రమ నిర్వహణ అసాధ్యం. దీంతో ఈ ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండానే విశాఖలో నూతన సంవత్సర వేడుకలు ముగియనున్నాయి.
Also Read: విశాఖలో వింత దోపిడీ సంస్కృతి