(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో పరమ పవిత్రం, పుణ్యక్షేత్రమైన విజయనగరం జిల్లా రామతీర్థంలో దుండగుల దాడికి, అపహరణకు గురైన కోదండరాముని విగ్రహం రామతీర్ధం కొండపైన రామకొలనులో బుధవారం లభ్యమైంది. లోతైన రామ కొలనులో ఉదయం నుండి జరిగిన నిరంతర గాలింపులో శ్రీరాముని శిరస్సు లభించింది. పోలీసుల సూక్ష్మ పరిశీలన, డాగ్ స్క్వాడ్ తనిఖీలలో డాగ్స్ కొలను వరకు వెళ్లి ఆగడంతో, అనుమానించిన పోలీసులు గజ ఈతగాళ్లతో కొలనులో బుధవారం వెతికించారు. రాములోరి విగ్రహం దొరకడంతో భక్తుల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ శ్రీరామనామస్మరణ చేశారు. కోదండ రాముని శిరస్సు దొరకడంతో మనసు పులకించిపోతోందని రామతీర్ధం సేవా పరిషత్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా చిన జీయరు స్వామి ఆశ్రమం ప్రతినిధులతో విగ్రహ శిరస్సు పునఃప్రతిష్ఠకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారవర్గాలు ప్రకటించాయి.
దుండగులను శిక్షించాలి
హిందూ దేవాలయాలపై, దేవుళ్లపై భవిష్యత్తులో దాడులు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా కఠిన చర్యలు చేపట్టాలని, దాడులకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని, దేవాలయాలకు సంపూర్ణ భద్రత కల్పించాలని బుధవారం తెలుగుదేశం, బిజేపీ, జనసేన, లోక్‌సత్తా తదితర విపక్ష రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి.
Also Read: సీఎంకు హిందూ దేవుళ్ళు అంటే ఇష్టం లేదు : బుద్దా వెంకన్న