ప్రజాప్రతినిధులపై మన దేశంలో ఉన్న దాదాపు 5 వేల కేసులను ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. 2015 సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర విచారణకు ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోంది. దీనిపై పలు రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, సదుపాయాలపై అమికస్ క్యూరీ ఇవాళ సుప్రీంకోర్టుకు వివరాలు తెలియజేసింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల సత్వర విచారణలో భాగంగా ఏపీలో విశాఖ, కడపల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు కానున్నాయి.
నోడల్ అధికారుల నియామకంపై ఆదేశాలు జారీ చేస్తాం
ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను సత్వరం విచారణ చేపట్టి వాటిని పూర్తి చేసేందుకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రత్యేక కోర్టుల వ్యవహారాలు చూసేందుకు నోడల్ అధికారుల నియామకంపై కూడా ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతి కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పనకు నిధుల కేటాయింపుపై కేంద్రం వాదనలు విన్నాక ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
ఏపీలో రెండు ప్రత్యేక కోర్టులు
ప్రజాప్రతినిధులపై కేసులను సత్వరం విచారణ పూర్తి చేసేందుకు ఏపీలో విశాఖ, కడపలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేస్తామని ఏపీ హైకోర్టు తెలిపిందని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు తెలిపింది. అవసరమైన కేసుల్లో సాక్షులకు రక్షణ కల్పించాలని అమికస్ క్యూరీ ధర్మాసనాన్ని కోరింది. అయితే ప్రతి సాక్షికి రక్షణ కల్పించడం సాధ్యమవుతుందా అని క్యూరీని ధర్మాసనం ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సాక్షుల రక్షణ అంశాన్ని ట్రయల్ కోర్టు నిర్ణయించాలని అమికస్ క్యూరీ ధర్మాసనానికి విన్నవించింది. తదుపరి విచారణపై సుప్రీంకోర్టు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది.