‘బాహబలి’తో రెబల్ స్టార్ ప్రభాస్ రేంజే మారిపోయింది. సిరీస్ లో రెండు చిత్రాలూ సంచలన విజయాలు నమోదుచేయడంతో.. ఒక్కసారిగా డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ అయిపోవడమే కాకుండా.. మోస్ట్ వాంటెడ్ హీరో ఆఫ్ ది ఇండియన్ స్ర్కీన్ అయిపోయాడు. అందుకే ఇప్పుడు ప్రభాస్ తో ఏ దర్శకుడూ సింపుల్ బడ్జెట్ తో సినిమాలు చేసే ఛాన్సే లేకుండా పోయింది. ఒక వేళ చేయాలనుకుంటే… మినిమమ్ 300 కోట్లు పెట్టాల్సిందే. అలాంటి పొజిషన్ లో ఉన్న ప్రభాస్ తో రొమాన్స్ చేయానికి మన సౌత్ బ్యూటీసేం సరిపోతారు?
అందుకే ఇకపై ప్రభాస్ తో తీసే భారీ చిత్రాలకోసం మేకర్స్ వరుసగా బాలీవుడ్ గాళ్ళ్ ను దింపుతున్నారు. ఆల్రెడీ ‘సాహో’ సినిమా కోసం అందాల శ్రద్ధాకపూర్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఇక్కడ నిరాశపరిచినా.. బాలీవుడ్ లో రికార్డు కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ సినిమాను పాన్ ఇండియా కేటగిరిలో విడుదల చేయాలని దర్శకుడు సుజిత్ ముందుగానే డిసైడవడంతో దానికి తగ్గట్టుగానే హీరోయిన్ గా శ్రద్ధాకపూర్ ను ఎంపికచేసి..ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు.
ప్రభాస్ తదుపరి చిత్రాల జాబితాను చూస్తే.. అందులో హీరోయిన్స్ అంతా బాలీవుడ్ బ్యూటీసే అవడం విశేషంగా మారింది. వైజయంతి బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే భారీ చిత్రానికి కథానాయికగా దీపికా పదుకొణేను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 500కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం సోషియో ఫాంటసీ కథాంశాన్ని రాసుకున్నాడు దర్శకుడు. తెలుగుతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ, అలాగే హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
అతి త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. ఇటీవలే అనౌన్స్ అయిన ప్రభాస్ మరో భారీ చిత్రం ఆదిపురుష్. ఇందులో డార్లింగ్ రాముడి అవతారమెత్తబోతున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో సినిమా త్వరలోనే లాంఛ్ కాబోతోంది. ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ ఆలీఖాన్ నటించబోతున్న సంగతి దర్శకుడు ఇటీవలే రివీల్ చేశాడు. అలాగే.. ఇందులో సీతగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని ఎంపికచేశారనే వార్తలొస్తున్నాయి. ఈ సినిమాను కూడా 500కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ హీరోగా కే.జీ.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ త్వరలోనే ఓ సినిమా తీయబోతున్నాడు. ఇది కూడా భారీ బడ్జెట్ రేంజ్ సినిమానే. ఇందులో ప్రభాస్ మాఫియా డాన్ గా నటించబోతున్నాడని తెలుస్తోంది. దీన్ని కూడా పాన్ ఇండియా కేటగిరిలోనే విడదల చేస్తారట. ఇందులో కూడా ప్రభాస్ సరసన కథానాయికగా ఓ బాలీవుడ్ బ్యూటీ ని సంప్రదించబోతున్నాడని వార్తలొస్తున్నాయి. పాన్ ఇండియా సినిమా కి ప్రస్తుతం ప్రభాస్ తప్ప వేరే హీరో కనిపించకపోవడంతో .. అందరు మేకర్స్ ఇప్పుడు ప్రభాస్ పైనే కాన్సెన్ ట్రేట్ చేస్తుండడం విశేషంగా మారింది. దాంతో అతడి సరసన నటించడానికి అందరికీ బాలీవుడ్ బ్యూటీసే ఆప్షన్ గా కనిపిస్తున్నారు. అదీ సంగతి.











