Online Ticketing System In Film Industry
ఏపీ ప్రభుత్వం చేతిలో అందరూ బుక్కయ్యారు. గొంతు పెకలడం లేదు. పిల్లి మెడలో ఎవరైనా గంట కడతారేమోనని ఎదురుచూశారు. కట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు.. ఒక్క మెగాస్టార్ తప్ప. ఆయన కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి జైకొట్టారు. ఈ నిర్ణయం వల్ల పారదర్శకత ఏర్పడుతుందని పొగిడారు. కాకపోతే టిక్కెట్ల ధరలను పెంచండి మహాప్రభో అని సవినయంగా విన్నవించుకున్నట్టుంది ఆయన ట్విట్టర్ ప్రకటన. ఏపీలో సినిమాల టిక్కెట్ల రేట్లు పెంచడం అనే విషయం గురించి గత కొన్ని రోజులుగా సినీ పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.
సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ లోనే అమ్మాలని ప్రభుత్వానికి సినీ పెద్దలు విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే భారీ చిత్రాలకు టిక్కెట్ల రేట్లు పెంచుకునేలా.. అలాగే అదనంగా షోస్ వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్మాతలు కోరడం.. సానుకూలంగా స్పందించి రాష్ట్రమంత్రి పేర్ని నాని హామీ ఇవ్వడం జరిగింది. అయితే.. సంక్రాంతి వస్తుండడం.. భారీ చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతుండడంతో టిక్కెట్ల రేట్లు పెంపు విషయమై ప్రభుత్వం ఎప్పుడు క్లారిటీ ఇస్తుందా అని ఎదురు చూస్తున్న నిర్మాతలకు ఏపీ గవర్నమెంట్ షాక్ ఇచ్చింది. ఆ షాక్ నుంచి ఎవరూ తేరుకోలేకపోతున్నారు.
Online Ticketing System In Film Industry
ఏపీలోని సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ లోనే అమ్మేలా ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. అయితే.. రోజుకు నాలుగు షోలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అలాగే భారీ చిత్రాలకు టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. దీని వలన భారీ చిత్రాలకు భారీగా నష్టం తప్పదు. ముఖ్యంగా డిసెంబరు నుంచి ప్రేక్షకుల ముందుకు వస్తున్న అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్.. తదితర భారీ చిత్రాలకు కోలుకోలేని దెబ్బే. ఇది ఇలాగే కొనసాగితే భారీ చిత్రాలు నిర్మించేందుకు నిర్మాతలు ఇంట్రస్ట్ చూపించకపోవచ్చు.
బెనిఫిట్ షోల విషయంలో ఒక నిబంధన పెట్టింది. ఛారిటీ కోసం షోలు వేసుకునే వెసులుబాటు కల్పించింది. ఛారిటీ పేరుతో వసూళ్లు చేసుకోడానికి ఈ నిబంధన మాత్రం బాగానే ఉపయోగపడుతుంది. ఈ విషయం గురించి చిరంజీవి స్పందిస్తూ.. పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్ టిక్కెటింగ్ బిల్ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం తగ్గించిన టికెట్ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది
దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది అని చిరంజీవి పేర్కొన్నారు. మరి.. చిరు విజ్ఞప్తికి ఏపీ ప్రభుత్వం స్పందిస్తుందేమో చూడాలి. సినీ పెద్దలు మాత్రం మల్లగుల్లాలు పడుతున్నారు. రెండు మూడు రోజుల్లో కొత్త కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. ప్రభుత్వ పెద్దల్ని కలిసే అవకాశం ఉంది.
Must Read ;- సంక్రాంతి కోళ్లు కాదు.. స్టార్లు.. రణమా, శరణమా?











