కరోనా ఇంకా వదల బొమ్మాళీ అంటోంది. తాజాగా చిత్ర పరిశ్రమలో సీనియర్ కొరయోగ్రాఫర్ అయిన శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా కరోనా బారిన పడ్డారు. శివశంకర్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు సమాచారం. ఎవరైనా ఆయనకు సహాయం అందిస్తారా అని ఎదురుచూస్తుంటే సోనూ సూద్ అభయ హస్తం అందించారు. తాను ఆ కుటుంబానికి అండగా ఉంటానని సోనూ సూద్ ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. శివశంకర్ కుమారుడితో సోనూ ఫోన్ లో మాట్లాడినట్టు తెలిసింది.
శివశంకర్ ఊపరితిత్తులో దాదాపు 75 శాతం ఇన్ ఫెక్షన్ కు గురైనట్టు చెబుతున్నారు. ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు. అయితే వైద్య చికిత్సకు డబ్బు అవసరమై ఆ కుటుంబ సభ్యలు ఇబ్బందులు పడుతున్నారు. ఆయన ఆస్పత్రిలో చేరి నాలుగురోజులైంది. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనతో పాటు ఆయన భార్యకూ, పెద్ద కుమారుడికీ కూడా కరోనా వైరస్ సోకినట్టు సమాచారం. వెండితెరతో పాటు బుల్లి తెర ప్రేక్షకులకు కూడా శివశంకర్ మాస్టర్ సుపరిచితమే. అనేక టీవీ షోలలో జడ్డిగా పాల్గొన్నారు.‘అరుంధతి’, ‘మగధీర’, ‘బాహుబలి’ చిత్రాల్లోని అనేక పాటలకు ఆయన డ్యాన్స్ కంపోజ్ చేశారు.
మనోజ్ హీరోగా నటించిన మన్మథ రాజా పాటకు ఆయన అందించిన నృత్యరీతులు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కేవలం కొరియోగ్రఫీ మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో వివిధ పాత్రలు కూడా పోషించారు. ఎంతో కాలంగా సినిమా రంగంలో ఉన్నా ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయారు. శివశంకర్ ను ఆదుకోడానికి చిత్ర పరిశ్రమకు సంబంధించి కొందరు ముందుకు వచ్చినట్టు తెలిసింది. సోనూ సూద్ మాత్రం ఎప్పటికప్పుడు శివశంకర్ కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటూ తగిన చర్యలు తీసుకుంటున్నారు.
Must Read ;- ఐసీయూలో వెంటిలేటర్ పై కైకాల సత్యనారాయణ











