ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ, కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి రద్దయింది. గత ఏడాది ఆగష్టు 5న కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు కావడంతో ఇక దేశంలోని రాష్ట్రాల తరహాలోనే జమ్ము, కశ్మీర్‌ను కూడా పరిగణించాల్సి ఉంటుంది. రాష్ట్రేతరులెవరికీ గతంలో జమ్ము, కశ్మీర్‌లో భూములు కొనగోలు చేసుకునే హక్కు లేదు. 370 అధికరణ రద్దుతో ఆ ప్రాంతంలో ఎవరైనా భూములు కొనుగోలు చేసుకునేందుకు వెసులుబాటు దొరికింది. తాజాగా జమ్ము, కశ్మీర్ రాష్ట్ర అభివృద్ధి సంస్థలోని సెక్షన్ 17లో ఉన్న శాశ్వత పౌరులకు మాత్రమే అనే పదాలను తొలగిస్తూ కేంద్ర హోం శాఖ గెజిట్ జారీ చేసింది. దీంతో జమ్మూ, కశ్మీర్‌లో ఇక ఎవరైనా ఇళ్లు కట్టుకోవచ్చు. పెట్టుబడిదారులు ఆయా ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి పరిశ్రమలు పెట్టుకునే వెసులుబాటు కూడా లభించింది.
పరిశ్రమలు పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారా?
జమ్మూ, కశ్మీర్ ప్రాంతంలో తీవ్రవాదం వెర్రి తలలు వేసింది. దేశానికి స్వాతంత్యం వచ్చాక ఏడు దశాబ్ధాలపాటు జేకేలో రక్తం ఏరులై పారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నుంచి జేకే కొంత కోలుకున్నట్టే కనిపిస్తోంది. 370 రద్దుతో జేకే భారత్‌లో అంతర్భాగమైంది. ఇక అక్కడ అభివృద్ధి పరుగులు పెడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. తాజాగా అక్కడ భూములు కొనుగోలు చేసి పరిశ్రమలు పెట్టేందుకు కూడా అడ్డంకులు తొలగిపోవడంతో ఇక జేకేలో భారీ పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి లేదనే చెప్పాలి. ఎందుకంటే స్థానిక పార్టీలన్నీ 370 ఆర్టికల్ రద్దును వ్యతిరేకిస్తున్నాయి. అలాంటి వారంతా జేకేలో పరిశ్రమలు పెట్టనిస్తారని భావించడం భ్రమే అవుతుంది.
అంత ఈజీ కాదు
జేకేలో పరిశ్రమలు పెట్టి నెగ్గుకురావడం ప్రయివేటు పెట్టుబడిదారులకు అంత తేలికైన పని కాదు. అయినా ఇప్పుడిప్పుడు వెంటనే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. వారిలో నమ్మకం కలిగించేలా ముందుగా కేంద్ర ప్రభుత్వం కొన్ని పరిశ్రమలు నెలకొల్పితే, ప్రయివేటు పెట్టుబడిదారులకు నమ్మకం కలుగుతుంది. అక్కడ పరిశ్రమలు పెట్టినా స్థానిక పార్టీలతో వేగడం కష్టం. అందుకే జేకేలో ప్రయివేటు పెట్టుబడులు మరికొంత కాలం రాకపోవచ్చు. అది ఎంత కాలం అని కూడా ఖచ్ఛితంగా చెప్పలేం.
రక్షణ రంగ ఫ్యాక్టరీల ఏర్పాటుకు అవకాశం
ఆయుధాల తయారీలో ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యాధునిక తుపాకుల నుంచి యుద్ధట్యాంకుల వరకు ఎలాంటి ఆయుధాలైనా ప్రయివేటు సంస్థలు తయారు చేసి ప్రభుత్వానికి సరఫరా చేసే అవకాశం ఉంది. జేకేలో ఇలాంటి పరిశ్రమలను ప్రోత్సహించాలి. ఆయుధాలు తయారు చేసే పరిశ్రమలకు భారీగా రక్షణ ఉంటుంది. అలాంటి పరిశ్రమలను టచ్ చేయడం కూడా కష్టం. ముందుగా రక్షణ రంగ పరిశ్రమలను ప్రోత్సహిస్తే కొన్నేళ్ల తరవాత నమ్మకం కుదిరితే ప్రయివేటు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
పర్యాటకం ఊపందుకుంటుందా?
జేకేలో పర్యాటకరంగ అభివృద్ధికి మంచి అవకాశం ఉంది. ఇప్పటి వరకూ అక్కడ ప్రయివేటు పెట్టుబడులు తక్కువే. ఇక జేకేలో భూములు కొనుగోలు చేసుకునే అవకాశం దక్కడంతో అనేక మంది పారిశ్రామిక వేత్తలు అక్కడ రిసార్టులు అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఊటీ తరహాలో గెస్ట్ హౌస్‌ల నిర్మాణం కూడా ఊపందుకుంటుంది. సామాన్యులు అక్కడకు వెళ్లి సొంతంగా ఇళ్లు కట్టుకునే సాహసం చేయకపోవచ్చు. పర్యాటకంగా ప్రఖ్యాతిగాంచిన ప్రాంతాల్లో మాత్రం రిసార్టులు, గెస్ట్ హౌస్‌లు, హోటళ్ల నిర్మాణంతో అక్కడి యువతకు ఉద్యోగాలు లభించి మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది. వేయి మైళ్ల ప్రయాణం అయినా ఒక్క అడుగుతో ప్రారంభం కావాల్సిందే. అందుకే జేకేలో ఆ అడుగు ఇప్పుడు పడిందనే భావించవచ్చు.











