(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వ్యాక్సిన్ వల్ల కొంత ఉపశమనం లభిస్తుందనే వార్తలు వస్తుండటంతో ప్రజలు బారులు తీరుతున్నారు. దాంతో తోపులాటలు .. కొట్లాటలు తప్పడం లేదు. వేరొకవైపు ఎండలు మండుతుండటంతో వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం .. అధికారుల ఉదాసీన వైఖరి ప్రజలను అవస్థలకు గురిచేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు పెద్దసంఖ్యలో గుంపులుగా చేరుతున్నారు. నిల్వలు కూడా అంతంతమాత్రమే ఉంటున్నందున .. వాటి కోసం ఎగబడుతూ భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారు. దీని వల్ల కరోనా మరింత ప్రబలే అవకాశం ఉందనే భయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.
గందరగోళంగా..
రాష్ట్రంలో రెండో డోస్ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా గురు, శుక్రవారాల్లో అనేకచోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ, శ్రీకాకుళం వంటి చోట్ల తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడం, సమాచార లోపంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతుండటంతో చాలాచోట్ల ప్రజలు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ కోసం బారులు తీరారు. గురువారం రెండో డోస్ వ్యాక్సిన్ మాత్రమే వేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. చాలా కేంద్రాల్లో కొవిడ్ మొదటి డోస్ వ్యాక్సిన్ కోసం ప్రజలు క్యూ కట్టారు. పట్టణ ప్రాంతాల్లో ఈ గందరగోళం ఎక్కువగా కనిపించింది. కొవాగ్జిన్ డోస్‌లు డిమాండ్‌కు తగ్గట్టు అందుబాటులో లేకపోవడంతో కొద్దిసేపటికే అయిపోయాయి. దీంతో ఈ టీకా కోసం వచ్చినవారు నిరాశగా వెనుదిరిగారు. కొన్ని జిల్లాల్లో కేవలం కొవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే వేశారు.
విశాఖలో బారులు తీరిన ప్రజలు
విశాఖలో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, ఛాతీ ఆస్పత్రి సహా పలు టీకా కేంద్రాల వద్ద ఉదయం ఏడు గంటలకే భారీ సంఖ్యలో ప్రజలు టీకా కోసం తరలివచ్చారు. సిబ్బంది వచ్చి కార్యక్రమం మొదలు పెట్టేసరికి చాలా ఆలస్యమవడం, గంటల తరబడి క్యూలో నిలబడాల్సి రావడంతో వృద్ధులు చాలా ఇబ్బంది పడ్డారు. స్వర్ణభారతి స్టేడియంలో ఉదయం 10.30 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించకపోవడంతో… అప్పటికే రెండు మూడు గంటల నుంచి వేచి చూస్తున్న ప్రజలు అసహనానికి గురయ్యారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరూ భౌతికదూరం కూడా పాటించలేదు. ఛాతీవ్యాధుల ఆస్పత్రి, కేజీహెచ్‌ల్లోని టీకా కేంద్రాల్లో సర్వర్‌లో అంతరాయంతో ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. ఈ జాప్యంతో తీవ్ర అసహనానికి గురైన ప్రజలు ఛాతీ ఆస్పత్రి వద్ద తోపులాటకు దిగారు. ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదం జరిగింది. తొలిడోస్ వేసుకునేందుకూ చాలా మంది రావడంతో ఇక్కడ గందరగోళం ఏర్పడింది.
పలుచోట్ల తోపులాట
శ్రీకాకుళం పట్టణంలోని దాలమ్మ కాలనీ, బర్మా కాలనీల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలకు తొలి డోస్ టీకా కోసం జనం పెద్ద సంఖ్యలో తరలిరావడం, వారికి వేయలేమని సిబ్బంది చెప్పడంతో కొంతసేపు తోపులాట జరిగింది. దాలమ్మ కాలనీలో పావుగంట సేపు టీకాల కార్యక్రమం నిలిచిపోయింది. పోలీసులు వచ్చాక గొడవ సద్దుమణిగింది. శ్రీకాకుళం జిల్లాలో కొన్ని కేంద్రాల్లో కొవిషీల్డ్, కొన్ని కేంద్రాల్లో కొవాగ్జిన్ టీకాలు మాత్రమే వేస్తామని అధికారులు ముందే ప్రకటించారు. దీని వల్ల గతంలో కొవాగ్జిన్ గానీ కొవిషీల్డ్ కానీ వేసుకున్నవారు.. ఇప్పుడు తమకు సమీపంలో ఆ టీకా కేంద్రం లేకపోవడంతో 60-70 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చింది. ఇంతా అక్కడకు చేరుకునే సరికి వ్యాక్సిన్ అయిపోవడంతో ఆందోళనకు గురయ్యారు.
* విజయనగరంలోని పూల్‌బాగ్, లంకాపట్నం కేంద్రాల్లో కొవాగ్జిన్ టీకాలు మాత్రమే వేశారు. వ్యాక్సిన్ సరిపడా లేకపోవడంతో పూల్‌బాగ్‌లో ఉదయం 11 గంటలకే ఆపేశారు. లంకాపట్నంలో 400 మందికి మాత్రమే వేశారు. గురువారం నుండి నిరంతరంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించిన అధికారులు .. శుక్రవారం చేతులెత్తేశారు. ఆయా కేంద్రాల్లో నిల్వలు నిండుకున్నాయని చెప్పడంతో.. శుక్రవారం ఉదయానికే అక్కడకు చేరుకున్న పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నాటికి గాని కోవాక్సిన్ అందుబాటులోకి రాదని తెలుస్తోంది.
* కడపలోని నకాష్ ప్రాంతంలోని ఆరోగ్య కేంద్రానికి టీకా కోసం వందల సంఖ్యలో తరలివచ్చారు. తగినన్ని టీకాలు లేకపోవడంతో చాలా మంది వెనుదిరిగారు. కొవిషీల్డ్ తొలిడోస్ వేసుకున్నవారిలో కొందరు, గడువు ముగియక ముందే రెండో డోస్ కోసం రావడంతో వారిని తిప్పి పంపించారు. కొవాగ్జిన్ ఉదయం 11 గంటలకే అయిపోయింది.
* చిత్తూరు జిల్లాలో ఉదయం 8.30 గంటలకే వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు వంటి చోట్ల తొలి డోస్ వేసుకుని 42 రోజులైన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తామని సిబ్బంది ప్రకటించారు. 28 రోజుల తర్వాత రెండో డోస్ వేస్తామని చెప్పి, ఇప్పుడు ఇలా అనడమేమిటని ప్రజలు అభ్యంతరపెట్టారు. ఉన్నతాధికారులను సంప్రదించాక 28 రోజులు పూర్తయిన వారికి టీకా వేయడంతో గొడవ సద్దుమణిగింది. తొలి డోస్ కొవాగ్జిన్ వేసుకున్నవారికి ఇప్పుడు తగినంత అందుబాటులో లేకపోవడంతో .. మే మొదటి వారంలో వేస్తామని తిప్పి పంపారు.
* కృష్ణా జిల్లాలో టీకా కేంద్రాల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. సరిపడా డోసులు లేకపోవడంతో చాలామంది వెనుదిరిగారు.
రాష్ట్రంలో అన్నిచోట్లా దాదాపు ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి .. ప్రణాళికాబద్ధంగా .. అందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Must read;-కేంద్రానికో ధర.. రాష్ట్రాలకో ధరనా?: వ్యాక్సిన్ ధరలపై కేటీఆర్ ట్వీట్