BJP Attacks On KCR Over Dalit Bandhu :
రైతు బంధు పథకం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఈజీ విక్టరీని అందించినట్టుగానే.. ఇప్పుడు బాగా హీటెక్కిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికను గెలిచేందుకు కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ఏదో ఎన్నికల్లో గెలిచేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు తప్పించి.. ఎన్నికల సమయంలో కాకుండా సాధారణ సమయంలో ఈ తరహా పథకాలు ప్రారంభించి ఉంటే.. వాటితో వచ్చే మైలేజే వేరేగా ఉంటుందని చెప్పక తప్పదు. ఎందుకంటే.. దళిత కుటుంబాలను దారిద్య్రం నుంచి పారదోలే ఈ తరహా బృహత్తర పథకం అందిన వారు.. ఎవరెన్ని చెప్పినా.. పథకాన్ని ఇచ్చిన పార్టీకే ఓటేస్తారు. అయితే ఎన్నికల స్టంట్ లో భాగంగా ఈ పథకాన్ని తీసుకొస్తే.. ప్రత్యర్థి పార్టీలు ఇతర వర్గాలను ఎగేసే ప్రమాదం ఉంది. వెరసి ఒక సామాజిక వర్గానికి మాత్రమే లబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని చూపి.. మిగిలిన వర్గాలు ఒకింత అసంతృప్తికి లోనయ్యే ప్రమాదం లేకపోలేదు. అదే సమయంలో వైరి వర్గాలు ఆ అసంతృప్తిని మరింతగా ఎగదోస్తే మాత్రం కొంప కొల్లేరే. ఇప్పుడు సరిగ్గా ఇలాగే జరుగుతోంది. మరి ఈ విఫరిణామం నుంచి టీఆర్ఎస్ ను కేసీఆర్ ఎలా గట్టెక్కిస్తారో చూడాలి.
హుజూరాబాద్ విన్నింగ్ కే దళిత బంధు?
హుజూరాబాద్ ఉప ఎన్నికను ఎలాగైనా గెలిచి తీరాల్సిందేనన్న కసితో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే.. తనను ధిక్కరించేలా వ్యవహరించిన మాజీ మంత్రి ఈటలను తన కేబినెట్ నుంచి కేసీఆర్ బహిష్కరిస్తే.. ఈటలేమో ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. వెరసి అక్కడ ఉప ఎన్నికను అనివార్యం చేశారు. అంతేకాకుండా నేనేమీ టీఆర్ఎస్ అండతో గెలవలేదని, సొంతంగా తనకున్న పట్టుతోనే గెలిచానని, ఇప్పుడు ఆ విషయాన్ని కూడా రుజువు చేస్తానని ఈటల సవాల్ చేశారు. మరి ఈటల సవాల్ ను తుత్తునీయలు చేసి టీఆర్ఎస్ బలమేంటో నిరూపించాలంటే.. హుజూరాబాద్ బైపోల్ ను కేసీఆర్ నెగ్గి తీరాల్సిందే కదా. ఈ క్రమంలోనే ఎప్పటినుంచో తన మదిలో ఉన్న దళిత బంధును కేసీఆర్ ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా హుజూరాబాద్ లో దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని చీలిపోకుండా చూసుకునేలా కేసీఆర్ దళిత బంధు పేరిట మంచి పాచికనే విసిరారు. అయితే ఈటలను చేర్చుకుని కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనేందుకు సిద్ధమైనపోయిన బీజేపీ ఏం తక్కువ తినలేదు కదా. అందుకే.. దళిత బంధు మంచి పథకమేనని, మరి ఇలాంటి పథకాలు ఒక్క దళితులకేనా?.. ఇతర అణగారిన వర్గాలు ఏం పాపం చేశాయన్న కొత్త పల్లవిని అందుకుంది.
ఎస్టీలకు ఎందుకు ఇవ్వరు?
బీజేపీ రచించిన ఈ వ్యూహాన్ని అమలులో పెట్టేసిన ఆ పార్టీ కీలక నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఇప్పుడు దళిత బంధు వేదికగా కేసీఆర్ పైకి సమరశంఖాన్నే పూరించారు. దళిత బంధుతో దళితులు దారిద్య్రం నుంచి బయటకు రావడం సంతోషమే. మరి దళితుల మాదిరే అణగారిన వర్గాలు.. అవకాశాలు లేక తంటాలు పడుతున్న వర్గాలకు ఇలాంటి పథకాలను వర్తింపజేయరా? అంటూ బాపూరావు ఓ కొత్త డిమాండ్ ను తెర మీదకు తెచ్చారు. ఇదే డిమాండ్ తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగుతున్నట్లుగా బాపూరావు సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా దళిత బంధు పథకాన్ని ఎస్టీలకు కూడా వర్తింపజేయాల్సిందేనని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. పోడు భూములపై ఎస్టీలకు హక్కులు ఇప్పిస్తామని చెప్పిన కేసీఆర్.. ఆ హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని ఆరోపించారు. బీసీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చిన హామీలను కూడా కేసీఆర్ విస్మరించారని ఆయన ధ్వజమెత్తారు. మొత్తంగా దళిత బంధుతో హుజూరాబాద్ ను గెలవాలని కేసీఆర్ చేస్తుంటే.. ఆయన వ్యూహాలను తుత్తునీయలు చేసే దిశగా బాపూరావును రంగంలోకి దించిన బీజేపీ.. సరికొత్త డిమాండ్లను వినిపిస్తూ.. అదే దళిత బంధుతో కేసీఆర్ కు మిగిలిన వర్గాలను దూరం చేసే యత్నాలకు పదును పెడుతోంది. మరి ఈ వ్యూహప్రతివ్యూహాల్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.











