కర్నూలు జిల్లా దేవరగట్టులో విజయదశమి సందర్భంగా గ్రామస్థులు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవంలో ఏటా వందలాది మంది గాయపడుతుంటూ ఉంటారు. ఒక్కోసారి కొందరు మరణించిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఇది తమ పూర్వీకుల నుంచి వస్తోన్న ఆచారమని గ్రామస్థులు చెబుతున్నారు. కర్రల ఉత్సవం జరగడానికి వీల్లేదని ఈ ఏడాది ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 1200 పోలీసులను మోహరించారు. చివరకు చేతులెత్తేశారు.
కర్రల స్వైర విహారం ఎందుకు ఆపలేకపోయారు?
ప్రతిపక్షాల నేతలు ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటాలు చేయాలని ప్రయత్నించిన ప్రతిసారీ ఏదో ఒక కారణంతో అరెస్టులతో అణచివేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు విశాఖలో భూముల ఆక్రమణ పరిశీలించేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకోగానే అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతల సమస్యలు వస్తాయంటూ వెనక్కు పంపారు. ఇక రామకుప్పంలో హంద్రీనీవా నీళ్ల కోసం తెలుగుదేశం నేతలు చేపట్టిన పాదయాత్రలను ఇంటి గడప దాటకుండానే హౌస్ అరెస్టులతో అడ్డుకున్నారు. ఇక అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఇన్ని చేస్తున్న ఏపీ పోలీసులు దేవరగట్టులో కర్రల ఉత్సవాన్ని ఎందుకు నిలువరించలేకపోయారనే ప్రశ్న ఉత్పన్నమ వుతోంది.
రాజకీయ ఒత్తిడులే కారణమా?
కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా విజయదశమి నాడు కర్రల ఉత్సవం నిర్వహిస్తారు. ఇది ఆచారంగా చెప్పుకుంటున్నా, ఒక రకంగా ఇది దురాచారమే. కర్రలతో ఒకరి తల ఒకరు పగలకొట్టుకోవడం ఆధునిక సమాజంలో ఆటవిక చర్యగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో కర్రల ఉత్సవాన్ని జరగనిచ్చేది లేదని పోలీసులు పెద్ద ఎత్తున హడావుడి చేశారు. మూడు జిల్లాల నుంచి ప్రత్యేక బలగాలను దింపారు. ఇక ఏముంది ఈ ఏడాది కర్రల ఉత్సవం నిలిచిపోయినట్టేనని అందరూ భావించారు. ఒక సమయంలో దేవరగట్టు గ్రామంలో స్థానికుల కన్నా పోలీసులే ఎక్కువ మంది కనిపించారు. రాత్రి సమయానికి ఏమైందో తెలియదు కానీ పోలీసులు చల్లగా జారుకున్నారు. వైఎస్సార్సీపీ నేతల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే పోలీసులను ఉపసంహరించారని తెలుస్తోంది. కర్రల ఉత్సవం నిలిపివేస్తే రాజకీయంగా వైఎస్సార్సీపీకి ఆలూరు నియోజకవర్గంలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇవన్నీ పరిశీలించిన పెద్దలు పోలీసు బలగాలను వెనక్కు పిలిపించారని తెలుస్తోంది. పోలీసుల హడావుడి చూస్తే కొండంతరాగం తీసి చివరకు లొల్లాయి పాట పాడిన చందంగా ఉందనిపిస్తోంది.
బన్ని ఉత్సవంలో 48 మందికి గాయాలు
రాత్రి సమయానికి పోలీసులు సర్ధుకోవడంతో దేవరగట్టులో అర్థరాత్రి 2 గంటలకు జనం కర్రలతో తండోపతండాలుగా వచ్చి కొట్టుకున్నారు. ఈ కర్రల ఉత్సవంలో 48 మంది గాయపడ్డారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. ఇలాంటి దురాచారాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు చూస్తుండిపోయారు. ఎవరు అధికారంలో ఉంటే వారికి ఊడిగం చేయడం తప్ప, స్వతహాగా ప్రజలకు న్యాయం చేసేదేమీ లేదని పోలీసులు మరోసారి నిరూపించారు.











