భూ రిజిస్ట్రేషన్‌లలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణల్లో మార్పులు చేపట్టింది. యజమానికి తెలియకుండా భూ యజమాన్య హక్కులు మార్చకుండా తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈరోజు నుంచి రాష్ట్రంలో ధరణి పోర్టల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పోర్టల్ ను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లికి మధ్యాహ్నం బయలుదేరనున్నారు. ధరణి ద్వారా ఇకపై తహసీల్దారు కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఇతర సేవలు అందనున్నాయి. ఈ సేవలు మరే రాష్ట్రంలోనూ లేవు.
ఇప్పటి వరకు కాగితాలపై కొనసాగుతున్న దస్తావేజుల నిర్వహణ ఇకపై డిజిటల్ రూపంలో కొనసాగనుంది. భూ యజమాని ఆధార్ కార్డు ఆధారంగానే దస్త్రాల్లో మార్పులు, చేర్పులు జరుగుతాయి. యజమానికి తెలియకుండా భూమికి సంబంధించిన వివరాల్లో మార్పులు చేయడం ఇక కష్టమే. యజమాని సెల్‌ఫోన్ నంబర్‌కు పంపే ఓటీపీ ఆధారంగానే ఈ మార్పులు జరుగుతాయి. దీంతో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర భూ హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం-2020 ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం జీఓను కూడా విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 570 తహసీల్దారు కర్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అమల్లోకి రానున్నాయి. నవంబర్ 2 నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ధరణి పోర్టల్ అమలుకు రూ. 51.30 కోట్లను ప్రభుత్వం విడుదలచేయగా ప్రతి తహసీల్దార్ కార్యాలయానికి రూ.9.లక్షల చొప్పున కేటాయించింది.











