ప్రకాశం జిల్లాలో ఖాకీలు కాఠిన్యం ప్రదర్శించారు. భర్తతో భార్యను వాతలు తేలేలా కొట్టించి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు కంభం పోలీసులు. బాధితురాలి సమాచారం ప్రకారం తెలుగు వీధిలో నివాసముంటున్న పిల్లరి సురేష్ తో పాటు అతని భార్య గురులక్ష్మిను ఓ కేసు విషయంలో విచారించాలని పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో స్టేషనుకు తీసుకెళ్ళారు. అయితే అక్కడ కేసు విషయంగా ఎలాంటి విచారణ చేయకుండానే సురేష్ తో అతని భార్యను ఒంటి పై వాతలు తేలేలా కొట్టించారని బాధితురాలు ఆరోపిస్తోంది.
సురేష్ కు తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వ ఆస్తులు విషయంలో తన చెల్లితో పాటు అన్నదమ్ములతో కొంత కాలంగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చెల్లెలు రమ్యకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ నిమిత్తం కంభం పోలీసులు రాత్రి సమయంలో భార్య, భర్తలను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. అయితే అక్కడ కేసు విషయంగా ఎలాంటి విచారణ జరపకుండా స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఖాశీంవలి తమను అత్యంత దారుణంగా దూషిస్తూ లాఠీతో కొట్టాడని బాధితులు ఆరోపిస్తోంది. మరోవైపు తన భర్త సురేష్ పక్షవాతం తో బాధపడుతున్నప్పటికి ఈ రకంగా హింసించడం పట్ల భార్య గురులక్ష్మి ఆందోళన వ్యక్తం చేస్తోంది. జరిగిన ఘటన పై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేసి హెడ్ కానిస్టేబుల్ ఖాశీంవలి ను సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేస్తుంది.