అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పనికిమాలినోడు, ఇగోయిస్టిక్ అంటూ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి. కలెక్టర్ పనికిమాలినోడు అయితే ఉత్తమ పనితీరు కనబరచినందుకు ప్రధాని మోడీ నుంచి అవార్డు ఎలా అందుకున్నారు. కేతిరెడ్డి వ్యాఖ్యలు వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రెండు గ్రామాల మధ్య కక్షలు, కార్పణ్యాలు చెలరేగకుండా కలెక్టర్ తీసుకున్న నిర్ణయమే అసలు వివాదానికి కారణమా. అనే విషయాలు పరిశీలిస్తే అనేక ఆసక్తికర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే…
వివాదం ఇప్పటిది కాదు..
మహా శివరాత్రి పండుగ సందర్భంగా రెండు గ్రామాల మధ్య దశాబ్ధాలుగా నెలకొన్న వివాదమే కలెక్టర్ గంధం చంద్రుడిపై ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర విమర్శలు చేయడానికి దారి తీసిందని తెలుస్తోంది. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం చిల్లవారిపల్లెలో కాటకోటేశ్వరస్వామి ఉత్సవాలను శివరాత్రినాడు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాల్లో చిల్లావారిపల్లె నుంచి గుర్రాలు తీసుకువచ్చి అగ్నిగుండంలోకి తీసుకెళ్లి మరలా గ్రామలోకి తీసుకురావడం ఆనవాయితీ. అయితే ఈ గుర్రాలు విషయంలో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని అంకేనిపల్లి, చిల్లావారిపల్లె గ్రామాలకు చెందిన వారి మధ్య దశాబ్దాలుగా వివాదం ఉంది. రెండు గ్రామాల బోయ కులస్తుల మధ్య ఈ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వైఎస్ రాజారెడ్డి జమానా నుంచి నేటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. అది నేటికీ పరిష్కారం కాలేదు. తాజాగా రెండు గ్రామాల వారి మధ్య వివాదం చెలరేగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్సవాలు నిషేధించారు. అయినా చిల్లావారిపల్లె గ్రామస్తులు ఊరేగింపు ప్రారంభించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలత చెందిన ఆలయపూజారి సోదరుడు రామేశ్వరరెడ్డి, ధర్మకర్త సోదరుడు బాలిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరామర్శించేందుకు వచ్చిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి కలెక్టర్ గంధం చంద్రుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేతిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని వాల్మీకి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రేనాటి శ్రీనివాస్ వెల్లడించారు.
ఆలయంపై దశాబ్దాలుగా ఆధిపత్య పోరు..
చిల్లావారిపల్లెలోని శివాలయానికి 800 సంవత్సరాల చరిత్ర ఉంది. బీసీలైన బోయలు, కురుమలతో పాటు, ఎస్సీలు, హరిజనులు ఆలయంలో దశాబ్దాలుగా పూజలు నిర్వహిస్తున్నారని వాల్మీకి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రేనాటి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ దేవాలయంలో ఎన్నో శతాబ్దాలుగా వాల్మీకీలు దేవస్థానం ధర్మకర్తలుగా, పూజారులుగా వ్యవహరిస్తున్నారని, ఈ మధ్య కాలంలో కొందరు రెడ్లు పూజారులుగా, ధర్మకర్తలుగా ప్రవేశించడమే అసలు వివాదానికి కారణమని శ్రీనివాస్ తెలిపారు. దీనిపై వాల్మీకీలు గత ఏడాది కలెక్టర్ గంధం చంద్రుడుకు ఫిర్యాదు కూడా చేశారు. చివరకు వ్యవహారం కోర్టుకు చేరినా, అక్కడ కూడా వాల్మీకీలకు అనుకూలంగా తీర్పు వచ్చిందని శ్రీనివాస్ తెలిపారు. ఇక్కడ అన్యాయానికి గురైంది వాల్మీకీలు, ఎస్సీలు. వారు ఆత్మహత్యాయత్నం చేయాలి కానీ, రెడ్లు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారని శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. అసలు వారు పురుగుల మందు తాగారా లేదా అనేది కూడా అనుమానంగా ఉందని, దీనిపై డాక్టర్ల రిపోర్టులు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కలెక్టర్ గంధం చంద్రుడుని టార్గెట్ చేయడం కోసమే ఆత్మహత్యాయత్నం డ్రామాకు తెరలేపారని శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు.
వారి ఆటలు సాగవనే కుట్రపన్నారు..
కలెక్టర్ గంధం చంద్రుడు సూటిగా వ్యవహరిస్తారని పేరుంది. అవినీతి ఆరోపణలు కూడా లేవు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి జాతీయ స్థాయిలో అవార్డు కూడా పొందారు. అయితే వైసీపీ నేతల అరాచకాలు సాగడం లేదనే ఉద్దేశంతోనే గంధం చంద్రుడుని బదిలీ చేయించే కుట్ర సాగుతోందని వాల్మీకి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రేనాటి శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు. అనంతపురం కలెక్టర్‌గా గంధం చంద్రుడు వచ్చాక అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఎస్సీలు, బీసీలు అంతా ఎలాంటి గొడవలు లేకుండా జీవిస్తున్నారని శ్రీనివాస్ గుర్తు చేశారు. కొందరి ఆటలు సాగక, కలెక్టర్‌ను బదిలే చేయించేందుకే ఆత్మహత్యాయత్నం కుట్రకు తెరలేపారని శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- వైసీపీలో వెన్నుపోటుదారులున్నారు : రోజా