తాజాగా ప్రాథమిక విచారణ పూర్తియినట్టు వార్తలు వస్తున్నాయి. విజిలెన్స్, రెవెన్యూ శాఖ అధికారులతోపాటు విజిలెన్స్ డీసీ పూర్ణచందర్ రావు, విజిలెన్స్ ఎస్పీ మనోహర్ నేతృత్వంలో జరుగుతున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది. కాగా ఆరోపణల్లో కొన్ని వాస్తవాలున్నాయని సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారులు సీఎంకి నివేదిక ఇవ్వనున్నారు.
ఆరోపణ..వివరణ
మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామ శివారులో ఉన్న సర్వే నెంబర్ 130, సర్వే నెంబర్ 111, సర్వే నెంబర్ 81లో 170 ఎకరాల భూమికి సంబంధించి ఈ ఆరోపణలు వచ్చాయి. కొందరు రైతులు ఫిర్యాదు చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అసైన్డ్ భూమిని ఆక్రమించారని ప్రధానంగా ఆరోపణలు రాగా..ఈ ఆరోపణలపై ఈటల ఇప్పటికే స్పందించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని వ్యాఖ్యానించారు. కుట్ర పూరితంగా ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను కష్టపడి సంపాదించుకోవడమే నేర్చుకున్నానని, ఎవరినీ ఎక్కడా ముంచలేదని, మానవత్వం పంచిన మనిషిగా ఉన్నానని వ్యాఖ్యానించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించినా సరేనన్నారు. కుట్రలు జరుగుతున్నాయని డైరెక్ట్ గా విమర్శించిన ఈటల..ఆ కుట్ర పార్టీలో జరిగిందా లేక బయటనుంచి జరుగుతుందా అనే అంశంపై స్పందించలేదు. అదే సమయంలో మంత్రి పదవి గొప్పదే అయినా.. అంతకంటే ఆత్మగౌరవం ముఖ్యమని వ్యాఖ్యానించారు.
రాజకీయ చర్చ ఇదీ..
అయితే ఈ ఎపిసోడ్ పై రాజకీయంగా చర్చ నడుస్తోంది. ఈటలకు పొమ్మనకుండా పొగపెట్టారనేది ఆ చర్చల సారాంశంగా ఉంది. ప్రభుత్వాన్ని అనుకూల కథనాలను ఎక్కువగా ప్రసారం చేసే మూడు నాలుగుఛానెళ్లలో ఇంచుమించు ఒకే సమయంలో భూ ఆక్రమణలపై కథనాలు రావడం, ప్రముఖంగా ప్రసారం కావడంతోపాటు ఆరోపణలకు సంబంధించి ఆధారాలు, నివేదికలున్నాయని చెప్పడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. గతంలో కొందరు మంత్రులపై ఇలాంటి ఆరోపణలు వచ్చినా సదరు మీడియా ఛానెళ్లు ఆ స్థాయి ప్రసారం చేయని అంశాన్ని కొందరు తెరపైకి తెస్తున్నారు. ఇదంతా ఓ కుట్ర ప్రకారం జరిగిందనే చర్చ నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల గడువు ముగిశాక వెంటనే ఈ కథనాలు రావడంకూడా చర్చకు కారణమైంది. గతంలో పీఆర్సీ విషయంలో, రెవెన్యూ సంస్కరణ విషయంలో లీకులు రావడం, ఉద్యోగుల్లో నిరసనలు రావడం తెలిసిందే. అయితే ఈ లీకుల వెనుక పరోక్షంగా ఈటల ఉన్నారనే కోణంలో టీఆర్ఎస్ అనుకూల పత్రికల్లోనే కథనాలు వచ్చాయి. ఇలా దాదాపు ఏడాదిన్నర కాలంలో ఈటలపై ప్రతికూల వార్తలు రావడాన్ని కూడా కొందరు నాయకులు ప్రస్తావిస్తున్నారు.
గతంలోనే అనుమానాలు..
కాగా ఈటల విషయంలో టీఆర్ఎస్ లో కుట్ర జరుగుతోందనే చర్చ గతంలోనే మొదలైంది. అప్పట్లో సామాజిక కారణాలూ తెరపైకి వచ్చాయి. అదే సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన ఓ మంత్రి ఆ సామాజిక వర్గాలతో మాట్లాడి పార్టీవైపే ఉండాలని ఒప్పించినట్టూ ప్రచారం జరిగింది. ఇక 2018ఎన్నికల్లో ఈటలపై పలు ఆరోపణలతో కరపత్రాల పంపిణీతోపాటు ఓడించేందుకు కూడా కుట్ర జరిగిందని ఈటల స్వయంగా ఓ సభలో వ్యాఖ్యానించారు. అదే సభలో మాట్లాడుతూ.. పార్టీకి ఓనర్లం మేమే అని, ఎవరో పెట్టిన భిక్ష కాదని వ్యాఖ్యానించారు. తరువాత కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా పేదరికం పోదని, ఉపాధి అవకాశాలే మార్గమని చెప్పడంతోపాటు కులం, మతం, పదవులు శాశ్వతం కాదని, ప్రజలే తమకు హైకమాండ్ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. తరువాతి కాలంలో కేటీఆర్ సీఎం అవుతారన్న అంశంపై ఈటలకూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. స్వయంగా ఓ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ తరవాత కొన్ని రోజులకే తానే సీఎంగా కొనసాగుతానని, కొందరు చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా కొన్నాళ్లపాటు ఈటలకు మంత్రి పదవి దక్కలేదు. తరవాతి కాలంలో వైద్య ఆరోగ్యశాఖకు అప్పగించారు. ఇటీవల ఈటల రాజేందర్ సైలెంట్ గా తీన్మార్ మల్లన్నను కలిసినట్టు జరిగిన ప్రచారంలోనూ ఈటల వ్యతిరేక వర్గ హస్తం ఉందనే చర్చ నడుస్తోంది.
విచారణ పూర్తి చేసేసిన ఆ మీడియా
తాజాగా మంత్రి ఈటలపై వచ్చిన భూ కబ్జా ఆరోపణల విషయంలో ప్రత్యేక శీర్షికలు పెట్టి మరీ సదరు ఛానెళ్లు బులెటిన్ లు, ఎపిసోడ్లు నడపడం చర్చనీయాంశమైంది. గతంలో రేవంత్ రెడ్డిపై వరుస కథనాలు వచ్చాక.. మళ్లీ ఈ స్థాయిలో ఈటలపై అలాంటి కథనాలు వచ్చాయని పలువురు నాయకులు చెబుతున్నారు.ఈటలపై వచ్చిన కథనాలను పరిశీలిస్తే..సదరు మీడియానే విచారణ చేసేసి నిజాన్ని నిగ్గుతేల్చినట్టుగా ఉండడం గమనించాల్సిన అంశం.
ఎందుకిలా..
కాగా ఈటలపై ఈ ఆరోపణలే ఎందుకు అనే ప్రశ్నకూడా తలెత్తుతోంది. తెలంగాణలోని ప్రధాన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ఈటల. అయితే ఆయన ఎప్పుడూ కుల రాజకీయాలు చేయలేదని ఆయనను దగ్గరనుంచి చూసినవారు చెబుతారు. టీఆర్ఎస్ లో కొన్నాళ్లుగా ఈటలపై కొందరు నాయకులు కుట్ర చేస్తున్నారన్న ప్రచారమూ ఉంది. ఎలాంటి కారణం లేకుండా ఈటలను తప్పిస్తే..టీఆర్ఎస్ కు భారీ నష్టం తప్పదన్న అంచనాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా, పార్టీలకు అతీతంగా ఈటలను అభిమానించేవారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమం నిలబడేందుకు ముఖ్యులైన వారిలో ఈటలకూడా ఒకరుగా పేరుంది. ఈ తరుణంలో ఈటలను తప్పించాలంటే బలమైన కారణం కావాలి. అదే సమయంలో ఆయన ఆర్థిక మూలాలపైనా చర్చ జరగాలనే వ్యూహంతోనే ఇలా చేశారనే చర్చ పార్టీల్లో నడుస్తోంది. భూమి కబ్జా జరిగిందా.. ఎవరి ఆధీనంలో ఉందనేది ఇంకా రుజువు కాకముందే మంత్రి వర్గంలో మార్పులపై చర్చ మొదలైందంటే..వ్యూహం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని నాయకులు చెబుతున్నారు. టీఆర్ఎస్ లో వ్యక్తిగతంగా, ఆర్థికపరంగా బలంగా ఉన్న కొందరు నేతలు రానున్న కాలంలో పార్టీ లో జరగనున్న మార్పులకు ఇబ్బందిగా మారతారనే ఉద్దేశంలోనూ ఇలా చేశారన్న ప్రచారం జరుగుతోంది.