ఎవరు అవునన్నా.. కాదన్నా రాజకీయాలకు సెంటిమెంట్‌కు ఉన్నఅవినాభావ సంబంధం అంతా ఇంతా కాదు. ఒకటికొకటి లంకె ఉన్న ఈ వ్యవహారం మారిన రాజకీయాలతో పాటు.. ప్రజల మైండ్‌సెట్‌లో కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. గతంలో సెంటిమెంట్‌కు అమిత ప్రాధాన్యం ఇచ్చే ఓటర్లు.. ఇప్పుడు లైట్ తీసుకోవటం రాజకీయవర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రజల్లో వచ్చిన మార్పును రాజకీయ పార్టీలు.. వాటి అధినేతలు గుర్తించటం లేదా? అన్నది మరో ప్రశ్న. తాజాగా వెలువడిన దుబ్బాక ఉప ఎన్నికతో ఈ కొత్త సందేహం రావటమే కాదు.. రాజకీయ పార్టీల్లో కొత్త చర్చకు తెర తీసిందని చెప్పక తప్పదు.
సానుభూతి ఓట్లు లేవు
గత ఎన్నికల్లో 60 వేల పైచిలుకు మెజార్టీతో ఘన విజయం సాధించిన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. హఠాత్తుగా అనారోగ్యంతో మరణిస్తే నియోజకవర్గం ఎంతలా కదిలి పోవాలి. ఆయనకు బదులుగా ఆయన సతీమణికి టికెట్ ఇస్తే.. చనిపోయిన ఎమ్మెల్యే మీద ఉన్న సానుభూతితో ఓట్లు వర్షంలా పడాలి కదా. వీలైతే గతంలో వచ్చిన మెజార్టీని దాటేయాలి. రోటీన్‌గా జరిగే స్టోరీ ఇదే. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. రాజకీయాలు మారుతున్నాయి. కొత్త తరం సెంటిమెంట్ రాజకీయాల్ని లైట్ తీసుకుంటోందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.
పాత వాసనలు వదిలించుకుంటున్నారా?
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతోనే ఇలా తేల్చేస్తారా? ఒక్క ఉదంతం ఏళ్ల తరబడి సాగుతున్న పరంపరకు చెక్ చెప్పేయటమా? అన్న మాట కొందరి నోట నుంచి రావొచ్చు. ఇక్కడో విషయాన్ని మర్చిపోకూడదు. ఒక్క దుబ్బాకలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన ఉప ఎన్నికల్నికాస్త గుర్తుకు తెచ్చుకుంటే.. పాత వాసనల్ని వదిలించుకోవటానికి తెలంగాణ ఓటర్లు సిద్ధమవుతున్నట్లుగా చెప్పక తప్పదు.
ఎక్కడి దాకానో ఎందుకు.. ఏడాది క్రితం జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికను గుర్తుకు తెచ్చుకోండి. తెలంగాణ కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచిన నేపథ్యంలో ఆయన తన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సందర్భంగా వచ్చిన ఉప ఎన్నికను చూస్తే.. ఉత్తమ్.. ఆయన సతీమణి ఇద్దరు కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్ని కవర్ చేశారు. పిల్లలు లేని తమకు తమ నియోజకవర్గ ప్రజలే పిల్లలన్న సెంటిమెంట్ డైలాగు చెప్పటమే కాదు.. ఢిల్లీకి వెళ్లాల్సిన నేపథ్యంలోనే సీటు ఖాళీ అయ్యింది తప్పించి మరో కారణం లేదని చెప్పారు.
అభ్యర్థి గెలవొచ్చేమో కానీ, నియోజకవర్గాన్ని తానే చూస్తానని.. గెలిపించాలని వేడుకున్నా ఫలితం ఎలా వచ్చిందో తెలుసు కదా? ఉత్తమ్ అడ్డాలో గులాబీ కారు దూసుకెళ్లింది. ఇక నారాయణ్ ఖేడ్, పాలేరు రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వచ్చిందో తెలిసిందే. ఆ రెండు స్థానాల్లో సిట్టింగులు మరణించటం.. వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చినా వారు రిజెక్టు చేశారు. తాజాగా వెలువడిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం చూసినప్పుడు అర్థమయ్యేది ఒక్కటే.. సెంటిమెంట్ సినిమా అయిపోయిందని. మరి రాజకీయ నేతలు ఈ విషయాన్ని ఎప్పటికి గుర్తిస్తారో..!