తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దూరదృష్టి ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించటం.. అన్ని విషయాల్లోనూ ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకోవటం లాంటి విషయాల్లో ఆయన చాలా ముందుంటారు. ఎక్కడిదాకానో ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయిన ఆయన.. ఏకంగా ఆరు వేర్వేరు సంస్థలతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకుని మరీ రంగంలోకి దిగారు.
మాటలతోనే అంచనా
ఇలా ప్రతి విషయంలోనూ మిగిలిన వారికి నాలుగు అడుగులు ముందు ఆలోచించే కేసీఆర్.. దుబ్బాక విషయంలో ఎలా పొరపాటు పడ్డారు. మిగిలిన అధినేతలకు భిన్నంగా కేసీఆర్‌కు ఒకే విషయాన్ని నాలుగైదు మార్గాల్లో వేర్వేరుగా క్రాస్ చెక్ చేసే అలవాటు ఉందని ఆయన సన్నిహితులు చెబుతారు. మామూలుగా మాట్లాడినట్లే మాట్లాడే ఆయన.. ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటలతోనే అంచనా వేయటంలో ఆయనకు సాటిగల నేతలు తెలుగు నేల మీద ఎవరూ లేరని చెబుతారు.
చాలానే గ్రౌండ్ వర్క్
దుబ్బాక ఉప ఎన్నికకు ముందు చాలానే గ్రౌండ్ వర్క్ జరిగిందని చెబుతారు. అభ్యర్థిగా సోలిపేట సుజాతను ఎంపిక చేసిన విషయంలోనూ.. ఆమె వద్దన్న చర్చ కూడా జరిగిందట. ఈ సందర్భంగా ఆయన చెప్పిన వాదనకు మిగిలిన నేతలు ఎవరూ మాట్లాడలేకపోయారట. దీనికి తోడు దుబ్బాక అన్నది తన అడ్డాలో భాగమని, అలాంటి చోట తాను ఎవరిని నిలబెట్టినా అక్కడి వారు ఆదరిస్తారని చెప్పారట. దుబ్బాక ఓటర్లు అభ్యర్థిని చూడరు.. పార్టీని చూస్తారన్న అంచనాతోనే మొదటి దెబ్బ పడినట్లుగా చెబుతున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆయన క్రాస్ చెక్ చేసుకునే మార్గాలు చాలానే ఉన్నాయి కదా? వాటి సంగతి ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే నిఘా వర్గం సైతం గెలుపు నివేదికను ఇచ్చారట. పోలింగ్‌కు ఒక రోజు ముందు ఇచ్చిన నివేదిక కూడా గెలుపు ఖాయమని తేల్చిందని.. పోలింగ్ తర్వాత ఇచ్చిన నివేదిక అయితే ఏకంగా పాతిక వేల ఓట్లకు పైనే మెజార్టీ వస్తుందన్న నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అంతా రాంగ్ ఫీడ్ బ్యాక్
ఎప్పుడూ లేనిది.. ఆయన విపరీతంగా నమ్మే సర్వే సంస్థలు సైతం ఆయన రాంగ్ రూట్‌లోకి వెళ్లేలా చేసినట్లు తెలుస్తోంది. తన సొంత పత్రికకు చెందిన సిబ్బంది చేత ప్రత్యేకంగా సర్వే చేయించుకున్నారట. అది కూడా.. దుబ్బాకలో బీజేపీ గాలి బాగా వీస్తోందన్న ప్రచారం జోరందుకున్న వేళ ఈ పని చేశారట. ఆసక్తికరంగా వారి నుంచి వచ్చిన నివేదికలోనూ దుబ్బాకలో కారు దూసుకెళ్లటం ఖాయమని తేల్చారట. చివర్లో ఏదో సందేహం కలిగి.. తన గురించి.. తన లోపాల గురించి తరచూ ప్రస్తావిస్తూ దమ్ముగా వార్తలు రాస్తారన్న పేరున్న సిబ్బందితో లోపాయికారీగా మాట్లాడుకుని.. వారి చేత కూడా క్రాస్ చెక్ చేయిస్తే.. వారు సైతం గెలుపు కారు ఖాతాలోనే పడుతుందని తేల్చారట.
ఇప్పుడు చెప్పినవి కొన్ని మాత్రమే. ఇతర మార్గాల్లోనూ సమాచారం తెప్పించినప్పటికీ.. వారంతా గెలుపు గులాబీదే అన్న మాటలతో కించిత్ అనుమానం కూడా రాలేదని చెబుతున్నారు. ఇలా అన్ని మార్గాలు.. గులాబీ బాస్‌ను రాంగ్ ట్రాక్‌లోకి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. ఏదైనా విషయం మీద సారు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినప్పుడు.. ఎప్పుడూ రానంత రాంగ్ ఫీడ్ బ్యాక్ దుబ్బాక ఎపిసోడ్‌లోనే వచ్చిందంటున్నారు. తనకు ఎదురైన ఈ కొత్త పరిణామంతో తన సమాచార మార్గాల్ని క్రాస్ చెక్ చేయటమే కాదు.. పునర్ వ్యవస్థీకరించాలన్న యోచనలోకి కేసీఆర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.