పోస్టల్ బ్యాలెట్ల గుట్టు రట్టు అయిపోయింది. 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లను వైసీపీకి అనుకూలంగా ఏ రీతిన మలచారో కూడా వెల్లడైపోయింది. ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిన ఓ హెడ్ కానిస్టేబులే స్వయంగా ఈ వివరాలను వెల్లడించారు. అది కూడా బహిరంగంగానే.. ఓ సమావేశంలో ఆ హెడ్ చెప్పిన వివరాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబం మెడకు చుట్టుకుంటుందా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఇక ఈ వ్యవహారాన్ని బయటపెట్టేసిన హెడ్ కానిస్టేబుల్ పై అప్పుడే వేటు పడిపోగా.. ఇంకా ఎవరెవరు ఈ వ్యవహారంలో బుక్ అవుతారన్న విషయం ఆసక్తికరంగా మారింది.
వైసీపీ చేతికి పోస్టల్ బ్యాలెట్ వివరాలు
ఎన్నికల విధుల్లో పాలుపంచుకునే సిబ్బందితో పాటుగా ఓటింగ్ కు రాలేని పరిస్థితిలో ఉన్న వారు పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్ ఓట్లనే కౌంటింగ్ లో ముందుగా లెక్కిస్తున్న వైనం మనకు తెలిసిందే. కౌంటింగ్ ఆరంభంలోనే కొద్దిమేర ఆధిక్యత సాధిస్తే.. ఇక ఆ పరుగు అలాగే సాగుతుందని, ప్రత్యర్థి ఆత్మరక్షణలో పడిపోతే.. కౌంటింగ్ నూ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం లేకపోలేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తీరాల్సిందేనన్న భావనతో రంగంలోకి దిగిన వైసీపీ.. అందుబాటులో ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేదు. ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ వివరాలనూ సేకరించింది. ఇందుకు తమకు అనుకూలంగా ఉన్న ఉద్యోగులను రంగంలోకి దించింది. అందులో భాగంగానే ప్రకాశం జిల్లా వివరాలను జగన్ సామాజిక వర్గానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ వెంకట రెడ్డి మరో నలుగురు కానిస్టేబుళ్ల సాయంతో సేకరించారు. ఆ వివరాలను వైసీపీకి అందజేశారు.
గట్టు రట్టు అయ్యిందిలా
గత నెల 30న ఒంగోలులో పలువురు వైసీపీ నేతలు, ఆ పార్టీకి అనుకూలంగా ఉండే కొందరు అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైకు అందుకున్న వెంకటరెడ్డి. పోస్టల్ బ్యాలెట్లను తాను ఎలా సేకరించింది? తనకు సహకరించిన వారెవరు? అన్న వివరాలను బయటపెట్టేశారు. అంతేకాకుండా తమ బృందానికి ఏదో ఒకటి చేయాలని, అప్పుడే పార్టీకి మరింత మెరుగైన సేవలు అందించగలుగుతామని చెప్పారు. వెంకటరెడ్డి మాట్లాడుతున్న సందర్భంగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్నంతటినీ రికార్డు చేశారు. తాజాగా దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కాగానే.. జిల్లా ఎస్పీ మలికా గార్గ్ దీనిపై దృష్టి సారించి వెంకటరెడ్డిని వీఆర్ కు పంపారు. అంతేకాకుండా ఆయనకు సహకరించిన వారిపైనా చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ భేటీకి హజరైన వారెవరు? వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశముందన్న విషయంపైనా జిల్లా ఎస్పీ ఆరా తీస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం బాలినేని కుటుంబానికి చుట్టుకుంటుందా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- వైరల్ వీడియో!.. అంబటి మళ్లీ దొరికిపోయారా?