JC Prabhakar Reddy Stage A New Agitation :
ఏపీ సీఎం జగన్ పాలనపై ఓ వైపు జనాగ్రహం అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో వైసీపీ పెద్దల మాటలు విని ప్రజాప్రతినిధులను అవమానించేలా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై టీడీపీ వినూత్న నిరసనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇలాంటి నిరసనలకు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుతం తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ హోదాలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి హైలెట్ గా నిలిచే ఓ వినూత్న నిరసనకు దిగారు. వైసీపీ నేత, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పిన మాటలు విని తాను ఏర్పాటు చేసిన సమావేశానికి డుమ్మా కొట్టిన అధికారుల తీరును నిరసిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారం తనదైన శైలి నిరసన చేపట్టారు. ఈ నిరసనతో అధికారుల్లో హైటెన్షన్ నెలకొనగా.. వైసీపీ నేతల్లో మాత్రం ఓ రకమైన భయాందోళనలు రనెలకొన్నాయన్న వాదనలువ వినిపిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..?
సోమవారం నాడు తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ హోదాలో మునిసిపాలిటీ కార్యాలయంలోనే జేసీ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశ సమాచారాన్ని ఆయన అధికారులకు శనివారమే చేరవేశారు. అయితే జేసీని అవమానించేలా వ్యూహం రచించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. మునిసిపాలిటీలో అధికారులు ఎవరూ ఉండకుండా చేశారు. కరోనా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీ పేరు చెప్పి సోమవారం నాడు అధికారులెవ్వరూ మునిసిపాలిటీకి వెళ్లలేదు. తమ ఇళ్ల నుంచి నేరుగా ర్యాలీకే వెళ్లారు. అయితే తాను ప్రకటించిన సమయానికే కార్యాలయానికి చేరుకున్న జేసీ.. సరే ర్యాలీ మంచిదే కదా.. ర్యాలీ అయిపోయిన తర్వాత అధికారులు వస్తారులే అన్న కోణంలో కార్యాలయంలోనే మధ్యాహ్నం దాకా వేచి చూశారు. అయితే అధికారులు మాత్రం ర్యాలీ ముగించుకుని అటు నుంచి అటే ఇళ్లకు వెళ్లిపోయారు. మునిసిపల్ కమిషనర్ అయితే ఏకంగా మధ్యాహ్నం నుంచి సెలవు పెట్టేసి వెళ్లిపోయారు. తాను ఏర్పాటు చేసిన సమావేశానికి డుమ్మా కొట్టేందుకే ఎమ్మెల్యే వ్యూహం రచించగా.. అధికారులు అందుకు సహకరించారని జేసీకి అర్థమైపోయింది.
జేసీ ఏం చేశారంటే..?
ఎమ్మెల్యే పెద్దారెడ్డి దుర్బుద్ధిని అర్థం చేసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. సాయంత్రం 4.30 గంటల సమయంలో కొందరు అధికారులు కార్యాలయానికి రాగానే.. తన చాంబర్ నుంచి బయటకు వచ్చి వారికి వంగి వంగి మరీ దండాలు పెట్టారు. చైర్మన్ స్వయంగా లేచి వచ్చి మరీ తమకు వంగి వంగి దండాలు పెట్టేసరికి అధికారులు విస్మయానికి గురయ్యారు. తమ సహాయ నిరాకరణ ఎమ్మెల్యేకు తెలిసిపోయిందన్న భావనతో తేలు కుట్టిన దొంగల్లా అలా పక్కకు వెళ్లిపోయారు. అయితే కమిషనర్ సెలవు పెడితే.. తనకు తెలపకుండా ఎలా వెళతారన్న ఆగ్రహంతో జేసీ.. కమిషనర్ వచ్చేదాకా కార్యాలయం నుంచి కదిలేది లేదన్నట్లుగా రాత్రి అక్కడే మునిసిపాలిటీ ఆవరణలోనే నిద్రించారు. మంగళవారం ఉదయమే లేచి అక్కడే స్నానాదికాలు ముగించుకుని తనదైన శైలి నిరసన తెలిపారు. అధికారులు, ఎమ్మెల్యేల వైఖరికి నిరసనగా జేసీ తెలిపిన ఈ వినూత్న నిరసన ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.
Must Read ;- ఒకే ఇంట ఇద్దరు ఎమ్మెల్యేలు.. లెక్కే లేదు











