కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా భారతీయ జనతా పార్టీ, ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మిత్రపక్షాలనే చెప్పాలి. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేసినా.. ఎన్నికల ఫలితాల తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరు పార్టీలు మిత్రపక్షాలుగా మారిపోయాయి. ఎలాంటి ఒప్పందం లేకుండానే.. మీకు ఇబ్బంది వస్తే మేం సహకరిస్తాం.. మాకు ఇబ్బంది వస్తే మీరు సహకరించండి అన్న చందంగా సాగుతున్న ఈ బంధం ఎన్నాళ్ల పాటు కొనసాగుతుందోనన్న విశ్లేషణలు నాడు ఆసక్తి రేకెత్తించాయి. అయితే ఆ బంధం మరింత కాలం పాటు కొనసాగే పరిస్థితులు లేవని, ఇప్పటికే ఆ రెండు పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైపోయినట్టేనన్న మాటలు కాస్తంత గట్టిగానే వినిపిస్తున్నాయి. శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీ తర్వాత ఈ వాదనలు మరింత బలపడిపోయాయనే చెప్పాలి. అయితే ఈ తరహా విభేదాలు వ్యూహాత్మకంగానే వచ్చాయా? లేదంటే నిజంగానే ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య చెదిరిపోయిందా? అన్న దిశగా సరికొత్త చర్చ మొదలైంది.
బీజేపీ విమర్శలను తిప్పికొట్టాల్సిందే
శుక్రవారం నాటి కేబినెట్ భేటీలో తన మంత్రివర్గ సహచరులపై సీఎం జగన్ తనదైన శైలిలో విరుచుకుపడినట్టుగా సమాచారం. ఓ వైపు టీడీపీ విమర్శలు చేస్తుంటే.. మరోవైపు బీజేపీ కూడా అదే రేంజిలో విమర్శలు సంధిస్తున్నా మంత్రులు ఎందుకు స్పందించడం లేదని జగన్ కోప్పడ్డ సంగతి తెలిసిందే. అంతేకాకుండా బీజేపీకి చెందిన ఇద్దరు నేతల పేర్లను ప్రస్తావించిన జగన్.. ఇకపై బీజేపీ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిందేనని, ఈ విషయంలో ఇకపై ఎంతమాత్రం నిర్లక్ష్యం వద్దని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఈ మాటలు నిజమేనన్నట్లుగా కేబినెట్ భేటీ ముగియగానే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించే నిమిత్తం మీడియా ముందుకు వచ్చిన మంత్రి పేర్ని నాని.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారని, ఏపీ సీఎం పీఠాన్ని లాక్కునే దిశగా ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన మరునాడే.. శనివారం మరో మంత్రి అంజాద్ బాషా బీజేపీని ఏకంగా మతతత్వ పార్టీగా అభివర్ణించారు. ఈ ఇద్దరు మంత్రుల వ్యాఖ్యలను చూస్తుంటే.. బీజేపీతో ఇకపై ఎంతమాత్రం సఖ్యతగా ఉండాల్సిన అవసరం లేదన్న భావనకు వైసీపీ వచ్చిందన్న మాట వినిపిస్తోంది.
ఎవరితో ఎవరికి అవసరం?
వాస్తవంగా ఏపీలో ఫుల్ మెజారిటీతో ఉన్న వైసీపీకి.. బీజేపీ కాదు కదా ఏ ఒక్క పార్టీ మద్దతు కూడా అవసరం లేదు. అయితే అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కు మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మాత్రం చాలా అవసరమే ఉంది. తన బెయిల్ రద్దు కాకూడదంటే..తాను మళ్లీ జైలుకు వెళ్లకూడదనుకుంటే.. బీజేపీతో మైత్రి జగన్ చాలా అవసరమనే చెప్పాలి. ఈ లెక్కల ఆధారంగానే బీజేపీతో జగన్ దోస్తానా కొనసాగిస్తున్నారు. ఇక కేంద్రంలోనూ మిత్రపక్షాల అవసరమే లేకుండా క్లిస్టర్ క్లియర్ మెజారిటీ ఉన్న బీజేపీకి కూడా పెద్దగా ఇతర పార్టీల మద్దతు గానీ, మైత్రి గానీ అవసరం లేదు. అయితే రాజ్యసభలో ఆ పార్టీ మెజారిటీ లేదు. అంతేకాకుండా త్వరలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవాలంటే.. ఓ రేంజిలో బలమున్న వైసీపీ అవసరం బీజేపీకి చాలానే ఉందని చెప్పాలి. మొత్తంగా ఇద్దరికీ ఇద్దరు అవసరమే గానీ.. ఎక్కడ చెడిందో గానీ ఇరు పార్టీల మధ్య ఇప్పుడు చిచ్చు రేగిందనే చెప్పాలి. మరి ఈ చిచ్చు ఇరు పార్టీలు జట్టు పట్టుకుని కొట్టుకునేదాకా వెళతుందా? లేదంటే నీళ్లు చల్లినట్లుగా చప్పున చల్లారిపోతుందా? అన్నది ఇప్పుడప్పుడే తేలేలా లేదన్న మాటలు వినిపిస్తున్నాయి.