Trouble For Amarnath In Nirmala Sitharaman’s Tour :
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గడచిన మూడు రోజులుగా ఉత్తరాంధ్రలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో పర్యటించిన ఆమె.. కేంద్ర నిధులతో కొనసాగుతున్న పలు సంక్షేమ పథకాల తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు విశాఖలో పర్యటించిన సందర్భంగా కేంద్ర ప్రాయోజిత పథకాలకైనా ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టరా? ఇకపై మోదీ బొమ్మతోనే ఆయా పథకాలను కొనసాగించాల్సిందేనని ఆమె ఒకింత ఫైరయ్యారు. ఈ సందర్భంగా అనుకోని రీతిలో ఆమె వెంట ఉన్న వైసీపీ యువ నేత, విశాఖ జిల్లా అనకాపల్లె ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఓ వైపు నిర్మల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. మరోవైపు వైసీపీ సర్కారును నిలదీస్తున్న నిర్మలమ్మ తీరును ఖండించలేక నానా అవస్థలు పడ్డారు. అంతేకాకుండా పక్కనే ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్యమధ్యలో నిలదీసిన తీరుతో అమర్నాథ్ మరింతగా ఇబ్బంది పడ్డారు.
అసలేం జరిగిందంటే..?
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆదివారం నాడు విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్మలా సీతారామన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర ప్రాయోజిత పథకాల అమలును పరిశీలించారు. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలమ్మ వస్తే.. ఆమె వెంట బీజేపీ కీలక నేతలు ఉంటారు కదా. అదే సమయంలో కేంద్ర మంత్రి వచ్చారన్న భావనతో గుడివాడ అమర్నాథ్ కూడా నిర్మలమ్మ వెంటే సాగారు. ఈ క్రమంలో పేదలకు రేషన్ బియ్యం పంపిణీని పరిశీలించిన నిర్మలమ్మ.. ఆ పథకానికి సంబంధించి పోస్టర్లపై ప్రధాని ఫొటో లేని వైనాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులతో కొనసాగే ఈ పథకం పోస్టర్లపై కనీసం ప్రధాని ఫొటో కూడా వేయరా? అంటూ ఆమె అక్కడి అధికారులను నిలదీశారు. ఇకపై మోదీ ఫొటో లేకుంటే సహించేది లేదని కూడా నిర్మలమ్మ వార్నింగే ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ మేర నిధులు ఖర్చె పెడుతోంది అని ప్రశ్నించిన నిర్మలమ్మ.. డబ్బు మాది ప్రచారం మీకా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవగాహన లేక నోరిప్పేదెలా?
ఈ ప్రశ్నతో నిర్మలమ్మ పక్కనే నిలుచున్న గుడివాడ అమర్నాథ్ స్పందించక తప్పలేదు. ఈ పథకానికి రాష్ట్రం కూడా నిధులు ఇస్తోందని ఆయన చెప్పబోయారు. అయితే మరి కేంద్రం ఈ పథకానికి డబ్బులు ఇవ్వడం లేదా? అని నిర్మలమ్మ ప్రశ్నించారు. అసలు కేవలం రాష్ట్ర నిధులతోనే మీరేం పథకాలు చేపడుతున్నారు? కేంద్రం నిధులతో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలేమిటి? అంటూ గుడివాడను నిలదీశారు. మా పథకాల పేర్లైతే గుర్తుంటాయి గానీ.. ఇక కేంద్రం పథకాలు మాకెలా గుర్తుంటాయంటూ నసిగారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చాలా పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోంది కదా.. ఆ విషయం మీకు తెలియదా? అంటూ మరో పక్కగా ఉన్న సోము వీర్రాజు అందుకున్నారు. ఇటు వైపు నిర్మలమ్మ, ఇటు వైపు సోము వరుస ప్రశ్నలు సంధిస్తుంటే.. వారికి సమాధానం చెప్పలేక, ఆయా విషయాలపై తనకు అవగాహన లేక.. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కున్నానే అన్న రీతిలో అమర్నాథ్ తల పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
Must Read ;- బీజేపీ, వైసీపీలు ఇక ప్రత్యర్థులేనా?











