గన్నవరం వైసీపీలో కుమ్ములాటలు సర్వసాధారణంగా మారాయి. వీటిని పరిష్కరించేందుకు స్వయంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి వంశీ, యార్లగడ్డ చేతులు కలిపినా వారు కీచులాటలు ఆపలేదు. గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి గెలిచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న వల్లభనేని వంశీ ఎంట్రీతో ఆ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. వంశీ చేతిలో 2019లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎలాగైనా గెలచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నారని తెలుస్తోంది. దీంతో టీడీపీ నుంచి వచ్చిన వంశీతో కలసి పనిచేసే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. తాజాగా గన్నవరం వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, దాసరి బాలవర్ధనరావు, యార్లగడ్డ వెంకట్రావు హనుమాన్ జంక్షన్‌లోని దుట్టా నివాసంలో రహస్య సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి నుంచి వైసీపీలో ఉన్న వారికి మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి, తరవాత వంశీని విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పంపించాలనే ప్రోపోజల్‌ను సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టాలని ఆ ముగ్గురూ ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. దీంతో వంశీకి గన్నవరంలో చెక్ పెట్టినట్టవుతుందని వారు భావిస్తున్నారు.
గన్నవరంలో అంత ఈజీ కాదు..
గన్నవరం వైసీపీ నేతలతో స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విసిగి వేసారిపోయారు. వారితో పడలేక, ఇక రాజకీయాలకు సెలవ్ అంటూ, వంశీ తన ఫేస్ బుక్ పేజీలో స్వయంగా పోస్ట్ చేశారు. వైసీపీ పెద్దల జోక్యంతో వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. ఆ తరవాత గన్నవరం వైసీపీ నేతలను ఒకటి చేసేందుకు ఆ పార్టీ అధిష్ఠానం చేయని ప్రయత్నం లేదు. చివరకు సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇద్దరి ప్రత్యర్ధుల చేతులు కలిపినా, వారు కలసి ముందుకు సాగేట్టు లేరు. దీంతో వైసీపీ అధిష్టానికి కూడా అర్థమయినట్టుంది. అందుకే గన్నవరం వైసీపీ నేతల పోరు రోజువారీ వ్యవహారంగా మారిపోయింది. అది ఇప్పట్లో తేలేది కాదని తెలుస్తోంది.
విజయవాడకు వల్లభనేని వంశీ?
గన్నవరం వైసీపీ నేతలు ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సహకరించే పరిస్థితి లేదు. అక్కడ తొమ్మిది సంవత్సరాలు వంశీతో పోరాటం చేసిన వైసీపీ నేతలపై తాజాగా జరిగిన గొడవల్లో కేసులు పెట్టడంతో స్థానిక నేతలు కూడా వంశీపై గుర్రుగా ఉన్నారు. ఇటు టీడీపీ కార్యకర్తల మద్దతు లేక, అటు వైసీపీ స్థానిక నేతల అండ కూడా కోల్పోవడంతో వల్లభనేని వంశీ గన్నవరంలో చురుగ్గా తిరగలేకపోతున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే వంశీ ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లినా వైసీపీ నేతలు మూడు గ్రూపులుగా విడిపోయి వంశీని పట్టించుకోవడం లేదని సమాచారం. దీంతో టీడీపీలో ఒకవెలుగు వెలిగిన వంశీ చివరకు వంద మంది కార్యకర్తలను కూడా జమచేయలేక రాజకీయాలపై విరక్తి ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. ఇక వైసీపీ పెద్దలు జోక్యం చేసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీకి టికెట్ కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంశీని గన్నవరం నుంచి ఖాళీ చేయించడం ద్వారా అక్కడ వైసీపీలో నెలకొన్ని విభేదాలకు ఈ విధంగా పరిష్కారం చూపాలని వైసీపీ అధిష్ఠానం ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది.











