ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీశైలంలో దుకాణాలను ముస్లింలకు కేటాయించిన వ్యవహారం దుమారం రేపుతోంది. శ్రీశైల దేవస్థాన దుకాణాలను వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి తన పలుకుబడితో 90 శాతం ముస్లింలకు కేటాయించి హిందూ దేవాలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారంటూ హైదరాబాద్ లోని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎట్టకేలకు శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి స్పందించారు. తనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. పెద్దల సమక్షంలో శ్రీశైలంలో రాజాసింగ్ చేసిన ఆరోపణలపై చర్చకు రావాలని చక్రపాణి రెడ్డి డిమాండ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే రాజాసింగ్ రాజీనామాకు సిద్దమా అని సవాల్ విసరడంతో వివాదం మరింత రచ్చకెక్కింది.
ముస్లింలు అక్కడ నాలుగు దశాబ్ధాలుగా ఉన్నారు
శ్రీశైలం దేవస్థాన దుకాణ సముదాయంలో ముస్లింలు 40 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి గుర్తుచేశారు. దీనిపై సుప్రీంకోర్టు నుంచి వారు ఆర్డర్లు కూడా తెచ్చుకున్నారన్నారు. రజాక్ అనే వ్యక్తి 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారని అతను తన అనుచరుడు కాదని చక్రపాణి రెడ్డి తెలిపారు. కావాలనే నేను ముస్లింలకు వాణిజ్య దుకాణాలు వచ్చేలా చేశాననే ఆరోపణల్లో నిజం లేదన్నారు. కర్నూలు జిల్లాలో ఎన్నో దేవాలయాల నిర్మాణాలకు లక్షలాది రూపాయలు విరాళంగా ఇచ్చానని, తన హిందుత్వం గురించి మఠాధిపతులు, పీఠాధిపతులను అడిగితే తెలుస్తుందన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసి హిందూ ద్రోహిగా ముద్రవేయాలని చేసే ప్రయత్నాలు ఫలించవని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజాసింగ్ ఏమన్నారు?
శ్రీశైలం దుకాణాల్లో తాత్కాలిక ప్రాతిపదిక ఇచ్చిన షాపులను తీసివేయాలని కోర్టు ఆదేశించినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. శ్రీశైలం దేవస్థాన దుకాణ సముదాయాల్లోని షాపులను స్థానిక ఎమ్మెల్యే ముస్లింలకు కేటాయిస్తున్నారని, ఈ వ్యవహారాలను రజాక్ అనే ముస్లిం వ్యక్తికి ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి అప్పగించారని ఆరోపించారు. దుకాణాలు నిర్వహిస్తున్న ముస్లింలు గొడ్డుమాంసం, మద్యం, మత్తుపానీయాలు వినియోగిస్తున్నారని రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. అన్యమతస్థులకు దుకాణాలు ఇవ్వకూడదని దేవాదాయ చట్టంలో స్పష్టంగా ఉన్నా వైసీపీ ప్రభుత్వం కావాలనే ముస్లింలకు షాపులు కేటాయిస్తోందన్నారు. శ్రీశైల పుణ్యక్షేత్రం ప్రతిష్ఠను కాపాడాలని, తాము ఇన్వాల్వ్ అయితే వ్యవహారం వేరుగా ఉంటుందని రాజాసింగ్ ఘాటుగా హెచ్చరించడంతో వివాదం మొదలైంది.