ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక సినిమా పూర్తయ్యే లోపే మరో రెండు, మూడు ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. అయితే ఈ విషయంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాస్త వెనుకబడ్డాడనే చెప్పాలి. ‘ఆర్.ఆర్.ఆర్’లో తన తోటి హీరో అయిన ఎన్టీఆర్ అయితే ఇప్పటికే రెండు సినిమాలను పైప్ లైన్లో పెట్టాడు. ‘ట్రిపుల్ ఆర్’ పూర్తవ్వగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక చిత్రం, ప్రశాంత్ నీల్ తో మరో సినిమాని చేయబోతున్నాడు తారక్. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత చరణ్ నెక్స్ట్ ఏంటి? అనేది మెగా ఫ్యాన్స్ కి మిలియన్ డాలర్స్ క్వశ్చన్ అయ్యింది.
ప్రెజెంట్ ‘ఆర్.ఆర్.ఆర్’తో బిజీగా ఉన్న చరణ్ ఆ తర్వాత చిరంజీవి ‘ఆచార్య’లో అతిథిగా కనిపించనున్నాడు. అయితే ‘ఆచార్య’లో కేవలం అతిథి పాత్ర మాత్రమే కాబట్టి అది చరణ్ మూవీ కిందకు రాదు. మరి ‘ట్రిపుల్ ఆర్’ తర్వాత చెర్రీ చేయబోయే సినిమా ఏది? ఏ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా ఉండబోతుంది? అనే ప్రశ్నలకు తాజాగా జవాబు దొరికిందనే చెప్పాలి.
రామ్ చరణ్ తన తర్వాతి చిత్రాన్ని వెంకీ కుడుమల దర్శకత్వంలో చేయబోతున్నాడట. ‘ఛలో’తో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుమల ‘భీష్మ’తో సూపర్ హిట్ అందుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేయడంతో గురూజీ కామెడీ టైమింగ్ ను బాగా ఔపోసాన పట్టేశాడు వెంకీ. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు తన చిత్రాల్లోని కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు ఈ యంగ్ డైరెక్టర్. అదే ఇప్పుడు వెంకీ కుడుమలకి చరణ్ తో చేసే మెగా ఆఫర్ తీసుకొచ్చిందట. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి హై ఆక్టేన్ పీరియాడికల్ డ్రామా తర్వాత కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలని భావించాడట రామ్ చరణ్. అందుకే వంశీ పైడిపల్లి వంటి పలువురు దర్శకులు కథలు వినిపించినా వెంకీకే ఓటేశాడట.
ఇక చరణ్-వెంకీ కుడుమల ప్రాజెక్టును నిర్మించబోయేది యు.వి. క్రియేషన్స్ అని తెలుస్తోంది. ఇప్పటివరకూ ప్రభాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన యు.వి. తొలిసారి మెగా కాంపౌండ్ హీరోతో చేయబోతున్న సినిమా ఇదే. ఈ చిత్రానికి యు.వి.తో పాటు చరణ్ కి చెందిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న చరణ్ – వెంకీ కుడుమల ప్రాజెక్టును త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయట. మరి టాలీవుడ్ లో సెట్టవ్వబోతున్న ఈ నయా కాంబో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.











