లైగర్ మిగిల్చిన చేదు అనుభవాల నుంచి దర్శకుడు పూరి తేరుకున్నట్టే. రామ్ తో ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ ఉంది కాబట్టి మళ్లీ రామ్ తోనే డబుల్ ఇస్మార్ట్ కు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఈరోజు ఉదయం 11. 11 గంటలకు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 12న ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది మార్చి 8న సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈరోజు పూజాకార్యక్రమాలను నిర్వహించి అధికారికంగా వివరాలను ప్రకటించారు.
ప్రస్తుతం రామ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో స్కంద రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబరు విడుదల కానుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ప్రకటించిన డబుల్ ఇస్మార్ట్ గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్. పూరి జగన్నాధ్ తో కలిసి ఛార్మి కౌర్ దీన్ని నిర్మిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ లో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. మరి ఇందులో ఇతర నటీనటులెవరన్నది ఇంకా ప్రకటించలేదు. కాకపోతే డబుల్ ఎంటర్ టైన్ మెంట్,
డబుల్ యాక్షన్, డబుల్ మేడ్ నెస్… వుయ్ ఆర్ బ్యాక్ అంటూ ట్విట్టర్ లో ప్రకటించారు. ఈ సినిమాకి రామ్ తీసుకునే రెమ్యూనరేషన్ రూ. 15 కోట్లు అనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం స్కంద ప్రమోషన్ వర్క్ చురుకుగా సాగుతోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ లో రామ్ చెప్పిన డైలాగ్ కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా.. నీ గేట్ దాటలేనన్నావ్ దాటా.. నీ పవర్ దాట లేనన్నావ్ దాటా.. అనే డైలాగ్ కు మంచి స్పందన లభిస్తోంది. ఇటు రామ్ కూ హిట్ కావాలి, పూరి-ఛార్మి లకు కూడా హిట్ కావాలి కాబట్టి కసితో ఈ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.