సంక్రాంతి బరిలోకి రామ్ ‘రెడ్’ దిగిపోయింది. కరోనా రాకుంటే ఏప్రిల్ లోనే ఈ సినిమా విడుదలై ఉండేది. ఈ రోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. దీన్ని ఏఎంబీ సినిమాస్ లో ప్రారంభించారు. హీరో రామ్, హీరోయిన్ నివేధా పేతురాజ్, మాళవికా శర్మ, దర్శకుడు కిశోర్ తిరుమల, నిర్మాత స్రవంతి రవికిశోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి హిట్ తర్వాత ఈ రెడ్ విడుదల కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం ఓ విశేషం. ఇటీవలే ఈ సినిమాలోని ‘కౌన్ హే అచ్చా.. కౌన్ హే లుచ్చా’ పాట విడుదలైంది.
రామ్ మంచి డ్యాన్సర్ కూడా కావడంతో పాటలపై కూడా శ్రద్దపెట్టినట్టు కనిపిస్తోంది. అన్ని పాటలకూ మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు మణిశర్మ ఈ పాటలకు చక్కటి బాణీలు సమకూర్చారు. సంక్రాంతికి రామ్ సినిమాలు విడుదల కావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు దేవదాసు, మస్కా కూడా సంక్రాంతికే విడుదలయ్యాయి. శ్రీస్రవంతి మూవీస్ పతాకంపై రూపొందిన ఈ సినిమాకి మంచి సాంకేతిక వర్గం కూడా సమకూరింది. ఈరోజు విడుదలైన ట్రైలర్ కు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.
ఇంట్లో పూజ గది ఉన్నా గుడికి వెళతాం కదా.. ఓటీటీ ఉన్నా థియేటర్లకు వెళ్లాల్సిందే: రామ్
రెడ్ మూవీ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో హీరో రామ్ మాట్లాడుతూ ఇంట్లో పూజ గది ఉన్నా గుడికి వెళ్లినట్టే ఎన్ని ఓటీటీలు ఉన్నా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడక తప్పదని అన్నారు. థియేటర్లలో సినిమా చూపించాలనే ఈ సినిమా విడుదలను ఇపటిదాకా ఆపామని అన్నారు. మళ్లీ కొత్త అనుభూతిని తమ సినిమా ఇవ్వబోతోందన్నారు. ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ చాక్లెట్ బోయ్ ఇమేజ్ నుంచి ఇస్మార్ట్ శంకర్ తో విశ్వరూపం చూపించే స్థాయికి రామ్ ఎదిగాడన్నారు.
రెడ్ తో ఆ ఇమేజ్ రెండింతలు పెరుగుతుందన్నారు. నిర్మాతగా రవికిశోర్ నిర్ణయాలు, కథ విషయంలో దర్శకుడు కిశోర్ తిరుమల జాగ్రత్తలు ఈ సినిమాలో కనిపిస్తాయన్నారు. ఈ సంక్రాంతికి రామ్ ద్వారా హిట్ రాబోతోందన్నారు. నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము) మాట్లాడుతూ రామ్ తెలుగు సినిమా రంగంలో చాలా ఎనర్జిటిక్ స్టార్ గా తను కూడా భావిస్తున్నానన్నారు.
దర్శకుడు కిషోర్ తిరుమల, హీరోయిన్లు నివేదా పేతురాజ్, మాళవిక శర్మ తదితరులు ప్రసంగించారు.
Must Read ;- దర్శకులకు మంచి డిన్నర్ ఇచ్చిన హీరో రామ్