ఉయ్యూరు మునిసిపాలిటీ పరిధిలో ఒక చిత్రం జరిగింది. గురువారం తెల్లవారే సరికి పట్టణంలోని బ్యాంకుల ఎదుట పెద్దపెద్ద చెత్త కుప్పలున్నాయి. బ్యాంకులకు వినయోగదారులకే కాదు కదా.. సిబ్బంది కూడా రావడానికి అసహ్యం అనిపించేలా.. దుర్గంధంతో కూడిన చెత్తకుప్పలు! తెల్లారేసరికి ఈ చెత్తకుప్పలు ఎలా వచ్చాయా? అనుకుంటున్నారా? ఆరాతీస్తే ఉయ్యూరు మునిసిపల్ కమిషనరే.. తన సిబ్బందితో అలాంటి పని చేయించినట్లుగా వార్తలొస్తున్నాయి.
ఇలాంటి అసహ్యకరమైన చెత్తపని ఎందుకు చేసినట్టు? మునిసిపల్ కమిషనర్ చిత్రమైన చర్యలకు దిగారెందుకు అనే అనుమానం ఎవ్వరికైనా కలుగుతుంది. చేయూత పథకానికి.. సహకరించటం లేదని.. చెత్త వేయించినట్లు బ్యాంక్ అధికారుల అనుమానిస్తున్నారు. పట్టణంలోని అన్ని ప్రభుత్వ బ్యాంక్ ల ఎదుట.. మునిసిపల్ కమీషనర్ స్వయంగా చెత్త వేయించారని అంటున్నారు. ఉయ్యూరు మునిసిపల్ కమీషనర్ చర్యలు వివాదాస్పదమయ్యాయి. ఏమిజరుగుతోందో తెలియక ఖాతాదారులు గుమిగూడుతున్నారు. ఉయ్యూరులో పలు బ్యాంకుల బ్రాంచ్ కార్యాలయాల ప్రధాన ద్వారాల వద్ద చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి.
అసలు ఆయన కమిషనరేనా.. తన మాట వినని వారి మీద కక్ష తీర్చుకోడానికి ప్రయత్నించే రౌడీ లేదా పొలిటికల్ లీడర్ లాంటి వ్యక్తా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి.. మీడియా వారు వివరణ కోసం ప్రయత్నించినా కూడా ఫలితం కనిపించలేదు. కమిషనర్ సూర్యప్రకాశ్ కనీసం మీడియా వారి ఫోన్ లకు కూడా స్పందించలేదని తెలుస్తోంది.
Must Read ;- స్థానిక ఎన్నికలకు ఎస్ఈసీకీ సహకరించాలని హైకోర్టు ఆదేశం











